BJP Strategy: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త వ్యూహాలతో దూసుకుపోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అమలు చేసిన అత్యంత విజయవంతమైన ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలోనూ పునరావృతం చేసేందుకు కమలం పార్టీ సర్వసన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో కాషాయదళం అందుకు సిద్ధమవుతోంది. ఎస్ఐఆర్ ను కాషాయదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా బూత్ స్థాయి కార్యకర్తలపై పార్టీ పెద్ద ఎత్తున బాధ్యతలను ఉంచింది. కేవలం పైస్థాయి ప్రకటనలకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్క కార్యకర్త క్షేత్రస్థాయిలోకి వెళ్లి విస్తృతంగా పనిచేయాలని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికీ కాషాయ నాయకులు కార్యకర్తలు వెళ్లి ఎస్ఐఆర్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది.
కాషాయ పార్టీ నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం.. బీజేపీ కార్యకర్తలు బూత్ లెవల్ అధికారులతో కలిసి ప్రతి ఇంటినీ సందర్శించనున్నారు. ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, అందులో పార్టీ మద్దతుదారులు ఎవరున్నారు, తటస్థంగా ఉన్న ఓటర్లు ఎవరు అనే అంశాలపై స్పష్టమైన మార్కింగ్ చేయనున్నారు. దీని ద్వారా ఏ బూత్‌లో పార్టీ బలం ఎంత ఉందనేదానిపై ఒక కచ్చితమైన అంచనాకు రానుందని సమాచారం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమన్వయం చేసుకునేందుకు నాయకులకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలోని జిల్లాలను బీజేపీ.. ఆరు జోన్లుగా విభజించినట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ, సమన్వయం సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒక్కో జోన్ పరిధిలోకి దాదాపు 7 జిల్లాలు వచ్చేలా ప్లాన్ చేశారు. పార్టీలోని పలువురు కీలక నేతలకు ఒక్కొక్కరికి 7 జిల్లాల చొప్పున పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, ఒకే పేరుతో రెండు చోట్ల ఉన్న ఓట్లను, మరణించిన వారి ఓట్లను జాబితా నుంచి పూర్తిగా తొలగించడం ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం. బూత్ లెవెల్ అధికారులు నేరుగా ఓటర్ల ఇళ్లకు వచ్చి ఓట్ల వివరాలను క్షుణ్ణంగా ధృవీకరిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో జూన్ 25 నుంచి జులై 24 వరకు ఈ ఇంటింటి ఓటర్ల సర్వే ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఇందులో ప్రతి పార్టీ తరఫున పోలింగ్ బూత్ స్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు.
Also Read: సామాన్యుడికి గుడ్ న్యూస్.. ఏసీ లేకున్నా లైఫ్ లాంగ్ కూలింగ్.. పైగా జీరో కరెంట్ బిల్లు!
అధికారులు ఇళ్లకు వెళ్ళినప్పుడు ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా వారితో కలిసి క్షేత్రస్థాయికి వెళ్తారు. ఎస్ఐఆర్ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అలర్ట్ అయ్యాయి. బీజేపీ ఈ వ్యవస్థను ఉపయోగించుకుని తమ మద్దతుదారుల ఓట్లను అక్రమంగా తొలగించే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అందుకే తమ పార్టీల బూత్ లెవెల్ కార్యకర్తలను కూడా అప్రమత్తం చేసి శిక్షణ ఇస్తున్నారు. కాగా బీజేపీ మాత్రం.. మరిణించిన వారి ఓట్లను తొలగించడంతో పాటు చొరబాటుదారుల ఓట్లను తొలగించడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు చెబుతోంది. అయినా కేంద్రంపై విమర్శలు ఏమాత్రం తగ్గడంలేదు.
తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ మొదలవ్వనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎందుకంటే ఈ ఏడాది చివరిలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఈ సర్వే ప్రభావం ఎలా ఉండబోతోందనే ప్రశ్నే ప్రధాన పార్టీల మెదళ్లను తొలచివేస్తోంది. గతంలో పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి సమీకరణాలు బీజేపీకి కలిసి వచ్చినట్లుగానే, ఇక్కడ కూడా కమలదళానికి లబ్ధి చేకూరుతుందా? అనే ప్రశ్నలు కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఉత్పన్నమవుతున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో స్థానిక, వలస జనాభా ఎక్కువగా ఉంటారు. సర్వే డేటాను విశ్లేషించి, ఏయే డివిజన్లలో ఏ వర్గాల ఓటర్లు బలంగా ఉన్నారో గుర్తించడం ద్వారా అభ్యర్థుల ఎంపికను బీజేపీ వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే బెంగాల్ పరిస్థితులకు, తెలంగాణలోని జీహెచ్ఎంసీ ఎన్నికలకు కొన్ని స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే బెంగాల్‌లో సరిహద్దు చొరబాట్లు, శరణార్థుల సమస్యలు స్థానిక ఓటర్లను ప్రభావితం చేశాయని, దాంతో బీజేపీ జాతీయవాద ముద్రతో బలపడిందని చెబుతున్నారు. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. ఇక్కడ జరిగేది మున్సిపల్ ఎన్నికలు కాబట్టి స్థానిక సమస్యలు ప్రధాన పాత్ర పోషిస్తాయని చర్చ జరుగుతోంది. కేవలం ఎస్ఐఆర్ వల్ల గెలవడం సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. బెంగాల్ తరహా వ్యూహాలను ఇక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుని, అటు సంక్షేమంపై అధికార పార్టీని నిలదీస్తూనే, ఇటు క్షేత్రస్థాయి సమీకరణాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఎస్ఐఆర్ పూర్తయ్యాక గ్రేటర్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
Also read: కాంగ్రెస్‌లో కొత్త మండల కమిటీలు.. వారికి మాత్రమే అవకాశం?