Kishan Reddy Politics : కిషన్ రెడ్డి అటాక్
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేసీఆర్ లక్ష్యంగా మరోసారి కాషాయ నేతలు విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ నాయకుల వైఖరి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తూ కేసీఆర్ వీడియోలు ప్రదర్శించిన నేపథ్యంలో బీజేపీ ఎదురుదాడికి దిగింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న విషయం వీడియోలో ఎక్కడా లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయేంత బలహీనంగా ఉందా? అని ప్రశ్నించారు.
KCR Politics : కేసీఆర్ కథ
కేసీఆర్ ఊహల నుంచి పుట్టిన కథే నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమని కిషన్ రెడ్డి అన్నారు.స్వామీజీలతో ఎక్కడైనా ప్రభుత్వాలు కూలిపోతాయా? అని ప్రశ్నించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఏ పార్టీ నుంచి గెలిచారు? అంటూ నిలదీశారు. కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారని విమర్శించారు. బ్రోకర్ల ద్వారా నేతలను పార్టీలో చేర్పించుకునే అలవాటు టీఆర్ఎస్ కు ఉందేమోగాని బీజేపీకి లేదన్నారు. తెలంగాణకు సంబంధించిన ఏ విషయమైనా పార్టీ అధిష్ఠానం తమను సంప్రదిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Telangana Politics : బురదజల్లే ప్రయత్నం
టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడంలేదని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగానే అధికారంలోకి వస్తామన్నారు. నలుగురు ఆర్టిస్టులు కూర్చొని అందమైన అబద్ధాన్ని వీడియోల రూపంలో పెడితే తెలంగాణ ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడు సీఎం కాలేరనే భయంతోనే ఇలా చిల్లర,జిమ్మిక్కు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలోకి సీబీఐని రాకుండా అడ్డుకునేందుకు పాత తేదీలతో జీవో ఇచ్చారని ఆరోపించారు. ప్రత్యేక హోదా పేరుతో గతంలో టీడీపీ ఏవిధంగా బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేసిందో.. ఇప్పుడు కేసీఆర్ అదే ప్రయత్నం చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు.
Telangana Politics : ఫామ్ హౌస్ కథ
సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కేసీఆర్ కోల్పోయారని విమర్శించారు. నలుగురు ఎమ్మెల్యేలకు ఎర కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు.కేసీఆర్ ఫామ్ హౌ స్‌లోనే సినిమా కథ అల్లారని ఆరోపించారు.ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేసిన విషయాన్ని తరుణ్ ఛుగ్ గుర్తు చేశారు. టీఆర్ఎస్ నేతలు నిజాయితీగా ఉంటే ఎందుకు ప్రమాణం చేయడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్‌కు విశ్వాసం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ చేసిన తప్పులకు ప్రజల ఓటు ద్వారా తగిన సమాధానం చెబుతారన్నారు.