Telangana BJP: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి, ఇతర పార్టీలకు మద్దతు పలికిన నేతలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు బీజేపీ రాష్ట్ర విభాగం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు పురపాలక సంఘాల్లో జరిగిన ఎన్నికల్లో, బీజేపీ కౌన్సిలర్లు కొందరు పార్టీ ఆదేశాలను పక్కన పెట్టి ఇతర పార్టీల అభ్యర్థులకు ఓటు వేసినట్లు పార్టీ గుర్తించింది. మెట్ పల్లి విప్ ధిక్కరణపై వేటు వేసింది. మెట్ పల్లి మున్సిపాలిటీలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన చెట్లపల్లి మీనా 18వ వార్డ్, చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ పై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ విప్ కాదని కాంగ్రెస్ కు ఓటేసిన వారిపై పార్టీ ఆరేండ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది.
మున్సిపల్ ఎన్నికల్లో మరికొన్ని చోట్ల అధికారిక పొత్తులు లేకపోయినా, స్థానిక నేతలే సొంత నిర్ణయాలు తీసుకుని ప్రత్యర్థి వర్గాలకు మద్దతు ప్రకటించినట్లు పార్టీకి సమాచారం అందింది. కాగా ఈ పరిణామాలను పార్టీ తీవ్రంగా పరిగణించింది. బీజేపీలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని స్పష్టంచేసింది. దీనిపై పూర్తి విచారణ చేపట్టి సస్పెండ్ కూడా చేస్తామని స్వయంగా పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు స్పష్టంచేశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ నియామకంలో విప్ జారీ చేశాక కూడా క్రాస్ ఓట్లు అవ్వడంపై కచ్చితంగా చర్యలు ఉంటాయని ఆయన నొక్కి చెప్పారు. దీనిపై మంగళవారం సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా సిద్ధమయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
Also Read: Shivani Nagaram: 100 సినిమాలు చేయాలనేం లేదు.. కాంబినేషన్ కాదు, కథ నచ్చాలి!
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ ఒక కార్పొరేషన్, ఒక మున్సిపాలిటీని మాత్రమే పూర్తిగా బీజేపీ కైవసం చేసుకోగలిగింది. కాగా మెట్ పల్లిలో విప్ జారీ చేసినట్లు రాంచందర్ రావు చెబుతున్నారు. సబ్మిషన్ లో జిరాక్స్ ఇచ్చారని, కానీ అక్కడి నేతలతో మిస్ కమ్యూనికేషన్ అయిందని చెప్పడం గమనార్హం. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ వశం చేసుకోగా నారాయణపేట మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా ఐదు మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ల పదవులను బీజేపీ దక్కించుకుంది. అందులో మూడు చోట్ల కాంగ్రెస్ కు, రెండుచోట్ల బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి వైస్ చైర్మన్లు బీజేపీ దక్కించుకుంది. ఆమన్ గల్ లో కాంగ్రెస్, బీజేపీ కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ ను దక్కించుకన్నాయి. అలాగే జిన్నారంలో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్ ను దక్కించుకుంది. నర్సాపూర్ లో కాంగ్రెస్, బీజేపీ కలిశాయి. అలియాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ, ఎల్లంపేటలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టును దక్కించుకున్నాయి. కాగా భైంసాలో ఇండిపెండెంట్ కు మద్దతిచ్చిన బీజేపీ ఎంఐఎంకు ఆ స్థానం దక్కకుండా వ్యవహరించడం గమనార్హం.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి ఇంటిపై ఆ పార్టీ కౌన్సిలర్లు దాడి చేశారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అత్యధిక కౌన్సిలర్లను గెలిచినా మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మెట్‌పల్లి చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటేసిన బీజేపీ కౌల్సిలర్ చెట్లపల్లి మీనా.. బీజేపీ విప్ జారీచేయకపోవడం వల్లే చైర్మన్ చేజారిందని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా దాదాపు 11 మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక వాయిదా పడింది. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల చైర్ పర్సన్ ఎంపిక వాయిదా పడ్డాయి. వాయిదా పడ్డ మున్సిపాలిటీలను మంగళవారం నాటికి రీషెడ్యూల్ చేశారు. కాగా రాష్ట్ర నాయకత్వం, అసలు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకుండా మద్దతు ఎలా ఇస్తారని జిల్లా స్థాయి నేతలను నిలదీస్తోంది. వచ్చే ఎన్నికల దృష్ట్యా పార్టీలో క్రమశిక్షణను కాపాడటం అత్యవసరమని భావిస్తున్న హైకమాండ్, ఈ చర్య ద్వారా ఇతర నేతలకు బలమైన హెచ్చరిక పంపాలని చూస్తోంది. పార్టీ గీత దాటితే ఎంతటి వారైనా సరే వేటు తప్పదని స్పష్టం చేస్తోంది.
Also Read: Tollywood: సుహాస్ సినిమా టైటిల్ కూడా మార్చేశారు.. సెన్సార్ టీమ్‌లో ఉన్న ఆ టాలెంటెడ్ పర్సన్ ఎవరో?