RTA Brokers: స్వేచ్చ బ్యూరో: ఇది ఏదో ప్రైవేటు ఏజెన్సీ ముంగిట వినిపించే మాటలు కావు., ప్రతినిత్యం వేలాది మంది వచ్చే రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాల్లోకి అడుగుపెట్టగానే పౌరులకు ఎదురవుతున్న ‘స్వాగత పలికే’ తీరిది!. రండిసార్.. రండి.. అన్నీ మేము చూసుకుంటామని బ్రోకర్లే ఆహ్వానం పలుకుతున్నారు. పారదర్శక పాలన అందిస్తున్నామని, సేవలన్నీ ఆన్‌లైన్ చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ‘దళారీల రాజ్యాంగమే’ నడుస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఖైరతాబాద్‌లోని రాష్ట్ర రవాణా కార్యాలయం మొదలుకొని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ ఆఫీసుల వరకు బ్రోకర్లు పాతుకుపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్టీఏ ఆఫీసు ప్రాంగణాలు, బయట ఉన్న చెట్ల కింద బ్రోకర్లు తమ అడ్డాలను ఏకంగా ‘సమాంతర ఆఫీసులు’గా మార్చేశారనే ప్రచారం జరుగుతుంది. పత్రాల పరిశీలన, లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, వాహనాల యజమాని పేరు మార్పిడి వరకు ప్రతి పనికీ ఒక రేటు ముందే ఫిక్స్ చేస్తున్నారు. “మా ద్వారా వస్తే పది నిమిషాల్లో పని ముగుస్తుంది.. లేదంటే ఆఫీసర్లు వంద లొసుగులు పెట్టి నెలల తరబడి తిప్పుతారు” అంటూ అమాయక వాహనదారులను భయబ్రాంతులకు గురిచేసి వేల రూపాయలు గుంజుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్రానికే తలమానికమైన ఖైరతాబాద్ ఎస్టీఏ కార్యాలయం ఆవరణలోనే మధ్యవర్తులు(బ్రోకర్లు) యథేచ్ఛగా సంచరిస్తున్నారు. ఉన్నతాధికారుల కళ్లముందే దర్జాగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఏదైన వాహనదారుడు వాహనం దిగకముందే ఏం పనిమీద వచ్చారు సార్.. డ్రైవింగ్ లైసెన్సా? ఆర్సీనా? పేరుమార్పుకోసమా? అంటూ ఆరా తీస్తున్నారు. ఏదైనా కావాలంటే చెప్పండి సార్.. చేసి పెడతామంటూ వివరాలు అడుగుతున్నారు. దేనికి ఎంతఅవుతుంది.. అనేది కూడా చెప్పేస్తున్నారు. ప్రధాన కార్యాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక జిల్లాలు, డివిజన్ స్థాయి ఆర్‌టీఏ కార్యాలయాల్లో వారి హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also read: SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!
కార్యాలయాల్లో అక్రమాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మధ్యవర్తులకు ఎంట్రీ లేదని రవాణా శాఖ అధికారులు పెద్ద ఎత్తున బోర్డులు ఏర్పాటు చేశారు. ఒకే వ్యక్తి ప్రతి రోజూ ఒకసారి కంటే ఎక్కువసార్లు వచ్చినట్లయితే అతడిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు సైతం జారీ చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నిఘా కెమెరాలు కేవలం ‘కంటితుడుపు’ చర్యగానే మిగిలిపోయాయనే ఆరోపణలు వస్తున్నాయి.అధికారుల ప్రకటనలు కాగితాలకే పరిమితమవ్వడం వెనుక లోపాయికారీ ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రచారం జరుగుతుంది.
రవాణా శాఖ దాదాపు అన్ని సేవలను ఆన్‌లైన్ పరిధిలోకి తెచ్చామని గొప్పగా ప్రకటించింది. సామాన్యుడికి సైతం అందుబాటులోకి తెచ్చామని, ఈజీగా వారు ఏం కావాలో దానికోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. అయితే, ఈ ఆన్‌లైన్ సేవలను ఎలా ఉపయోగించుకోవాలి? స్లాట్ బుకింగ్ విధానం ఏమిటి? అనే అంశాలపై సామాన్యులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.సాంకేతిక పరిజ్ఞానంపై సరైన ప్రచారం లేకపోవడమే బ్రోకర్లకు పెద్ద వరంగా మారింది.ఆన్‌లైన్‌లో సులభంగా అయ్యే పనికి కూడా సామాన్యులు వేల రూపాయలు ఏజెంట్లకు సమర్పించుకోవాల్సి వస్తోంది.
ఆఫీసు ఆవరణలోనే ఇంతటి దందా సాగుతున్నా ఉన్నతాధికారులు కనీసం తనిఖీలు చేపట్టకపోవడం.. నిఘా పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. శాఖలోని కొంతమంది సిబ్బంది, అధికారులే మధ్యవర్తులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా రవాణా శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి ఆర్‌టీఏ కార్యాలయాల్లో బ్రోకర్ వ్యవస్థను శాశ్వతంగా అరికట్టాలని, ఆన్‌లైన్ సేవలపై విస్తృత అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఆ దిశగా చర్యలు ప్రక్షాళన చేపడతారా? లేదా? అనేది చూడాలి.
Also Read: చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!