BRS Strategy: స్వేచ్చ బ్యూరో: మీడియాలో స్పేస్ కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అసెంబ్లీ కొనసాగినన్ని రోజులు ప్రతి రోజూ ఏదో ఒక అంశంపై నిరసనలు తెలపాలని పార్టీ ఆదేశించింది. ప్రతిపక్షం వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్లాలని అందుకు ప్రణాళికలతో వెళ్లాలని.. ఒకవైపు నిరసనలు.. అసెంబ్లీలో గళం.. మీడియా పాయింట్ లోనూ మాట్లాడాలి..ప్లకార్డులు ప్రదర్శించాలి.. ఏదోరకంగా ప్రజల్లోకి అంశాలపై కొట్లాడుతున్నామనే భావన తీసుకురావాలని..పార్టీపై ప్రజలకు నమ్మకం కలిగించేలా ముందుకుసాగాలని సూచించినట్లు సమాచారం. అందుకే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా నిర్ణయించిన సమయానికి అసెంబ్లీకి చేరుకుంటున్నారనేది స్పష్టమవుతోంది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీడియాపై అంతగా ఫోకస్ పెట్టలేదు. వారే రాసుకుంటారనే ధోరణిలో ఉండేది. అయితే ప్రతిపక్షానికి పరిమితం అయిన తర్వాత ఎక్కువగా మీడియాపైనే ఫోకస్ పెట్టింది. నిత్యం ఏదో అంశంపై మాట్లాడి ప్రజల్లోకి వెళ్లేలాల ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలను అనుకూలంగా మల్చుకునేందుకు సిద్దమైంది. అసెంబ్లీ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు ప్రతి రోజూ ఏదో ఒక అంశంతో ముందుకు వెళ్లాలని పార్టీ అధిష్టానం షెడ్యూల్ ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాల సమయానికి ముందు గన్ పార్కువద్ద నిరసన తెలిపాలి మీడియాతో మాట్లాడాలని, ఆతర్వాత అసెంబ్లీలో మాట్లాడాలని, మళ్లీ కొంతమంది ఎమ్మెల్యేలతో మీడియాతో మాట్లాడించాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. దీని ప్రకారమే తొలి రోజు.. ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని,రెండో రోజూ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, మూడోరోజూ రైతులు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు అంశంపై నిరసన తెలిపారు. ఇలా మిగిలిన రోజుల్లోనూ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, బీసీ రిజర్వేషన్లు, నీటి ప్రాజెక్టులు, భూభారతి, బీసీ రిజర్వేషన్లు, పేదల ఇళ్లు కూల్చివేత-హైడ్రా తదితర అంశాలపై మాట్లాడబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ప్లకార్డులను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రతి అంశాన్ని మాట్లాడి ప్రజల్లోకి వాయిస్ వెళ్లేలా ప్రణాళికలతో ముందుకు సాగుతుంది.
Also Read: Romantic Movie OTT: ప్రియుడి మరణంతో మౌనం… జ్ఞాపకాలతో ప్రేమ ప్రయాణం… ఓ మరపురాని ప్రేమ కథ
అసెంబ్లీలోనూ అధికారపక్షంపై ఆధారాలతో ఘాటుగా మాట్లాడాలని, ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయాలని వ్యూహ రచనచేసి ముందుకు సాగుతున్నారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు డిప్యూటీ ప్లోర్ లీడర్లు, యాక్టీవ్ గా ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడాలని, నిత్యం ఆయా అంశాలపై ప్రేపర్ తో రావాలని ఇప్పటికే సూచించినట్లు తెలిసింది. మాట్లాడే సమయంలో అధికారపక్షానికి ఎలాంటి అవకాశం(క్లూ) ఇవ్వకుండా తప్పిదాలను ఎత్తిచూపాలని అందుకే వాక్ చాతుర్యం ఉన్నవారికే మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. అధికారపక్షం తప్పిదాలను ఆధారాలతో సహ ఎత్తిచూపుతున్నారు. ఇప్పటికే మంత్రులు సైతం అధికారులతో ఇంటర్నల్ గా చర్చించిన అంశాలను సైతం మాట్లాడుతుండటం, శాఖల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటపెడుతుండటంతో డిఫెన్స్ లో పడుతున్నారు. అంతేకాదు ఛాలెంజ్ లు సైతం విసురుతూ మీడియాలో ప్రధానంగా నిలుస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా ముందుకు సాగుతున్నారు.
మరోవైపు స్పీకర్ కు వాయిదా తీర్మానాలు ఇస్తున్నారు. చర్చించాలని పట్టుబడుతున్నారు. అంతేకాదు ప్రశ్నోత్తరాల సమయంలోనూ గత రెండున్నరేళ్లలో చేయని పనులు, కేటాయించని నిధుల, పెండింగ్ ప్రాజెక్టులు, రోడ్లు, నియామకాలు, మహిళలకు ఇస్తామన్న హామీలు నెరవేర్చలేదనే అంశాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీసేందుకు సిద్ధమవుతున్నవారు. మంత్రులు గానీ, అధికారపార్టీ ఎమ్మెల్యేలుగానీ మాట్లాడితే వారికి వాక్ చాతుర్యంతో తిప్పికొట్టాలని, విమర్శలకు పదును పెట్టేందుకు సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ సభ్యులు చేసేవ్యాఖ్యాలను వారికే తిప్పికొట్టాలని అందుకు ప్రతి ఒక్కరూ రెడీగా ఉండాలని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. ప్రజలు సభ జరిగినన్ని రోజులు బీఆర్ఎస్ గురించి, గత పాలనలో చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పాలనలో చేసిన వైఫల్యాలను ఎత్తిచూపేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసినవారికి ఆయాశాఖలపై మాట్లాడాలని ఇప్పటికే సూచనలు చేసినట్లు తెలిసింది. ఇదెలా ఉంటే బడ్జెట్ ను అసెంబ్లీలో పెట్టిన తర్వాత మరింత వాడీవేడిని పెంచబోతున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ప్రతి రంగానికి నిధుల కేటాయింపుపై అసెంబ్లీలో నిలదీస్తామని అందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటాయింపులు.. మంజూరు.. పెండింగ్.. చేసిన పనులు అన్నింటిని వివరించాలని భావిస్తూ కసరత్తును ఇప్పటికే ప్రారంభించారు. అనుభవం ఉన్నవారితో వివరాలు సైతం సేకరిస్తున్నారు. దీంతో ఇక బడ్జెట్ సమావేశాలు మరింత వేడిని రాజుకోబోతున్నాయి. బీఆర్ఎస్ అసెంబ్లీలో పై చెయ్యి సాధించేందుకు ముమ్మర కసరత్తును ప్రారంభించింది. అధికార కాంగ్రెస్ పై నెగ్గుతుందా? చతికిల పడుతుందా? అనేది చూడాలి.
Also Read: Nalgonda News: నల్గొండలో వరి కోతలు షురూ.. రైస్ మిల్లులకు తరలుతున్న ధాన్యం