Sridhar Babu: అధికారంలోకి వస్తే హెచ్‌సీయూ భూములను కాపాడతామంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల జోలికి వెళ్లడం లేదని, హెచ్‌సీయూకు చెందిన అంగుళం భూమిని కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
‘హెచ్‌సీయూకు సంబంధం లేని భూముల విషయంలో విద్యార్ధులను రెచ్చగొడుతున్నారు. విద్యార్ధులను పావులుగా వాడుకుంటున్నారు. ఫేక్ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్ధులను తప్పుదోవ పట్టిస్తున్నారు. రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలి’ అని మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హితవు పలికారు. పారిశ్రామిక అభివృద్ధి చేసి, ఉపాధి అవకాశాలను పెంచాలన్న తపనతో, లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తుండగా ఆయనపై కేటిఆర్ వ్యక్తిగతం దూషణలకు దిగడం సరైన చర్య కాదని మంత్రి చెప్పారు.
ఫేక్ ప్రచారాలతో పారిశ్రామిక అభివృద్దిని అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకుండా చేసే కుటిల కుట్రలను మానుకోవాలన్నారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు, హెచ్‌సీయూకు ఎలాంటి సంబంధం లేదని.. ఆ భూమిపై సర్వహక్కులూ ఈ ప్రభుత్వానివే అని చెప్పారు. కంచె గచ్చిబౌలి భూములను ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఒక ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేస్తే దానిని రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. ఆ తర్వాత ఆ భూములను కాపాడింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అని మంత్రి చెప్పుకొచ్చారు.
‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఈ భూముల గురించి ఎందుకు నోరు మెదపలేదు. ఎందుకు పట్టించుకోలేదు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములను అప్పనంగా బినామీలకు కట్టబెట్టిన బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు మాట్లాడుతుంటే .. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. మూడేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి కంచె గచ్చిబౌలి భూములను వెనకకు తీసుకుంటామని, ఎకో పార్క్ ఏర్పాటు చేస్తామని పదేండ్లు అధికారంలో ఉన్న నాయకులు ఈ రోజు మతిలేని మాటలు మాట్లాడుతున్నారు. మూడు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు’ అని మంత్రి ఫైరయ్యారు.
‘2014 నుంచి 2023 వరకు 4,28,437 ఎకరాల అటవీ భూమిని మాయం చేశారు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 7,829 ఎకరాల అటవీభూములను సేకరించారు. ప్రాజెక్టుల పేరుతో అటవీ భూములను సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ ప్రబుద్ధులు ఈ రోజు పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి ఎక్కడిది..? అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసానికి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడింది. ఆనాడు వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ కోసం వేలాది చెట్లను నేలకూల్చిన చరిత్ర వారిది కాదా?’ అని మంత్రి నిలదీశారు.
‘ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఎ) కు విరుద్ధంగా 2016 నుంచి 2019 వరకు తెలంగాణలో 12,12,753 చెట్లను తొలిగించారని ఇటీవల పార్లమెంట్‌లో ఒక ఎంపీకి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో చెట్లను నరికేసిన రాష్ట్రాలలో టాప్ -3 లో తెలంగాణ ఉంది. మీ చరిత్ర ఇలా పెట్టుకొని ఈ రోజు నీతులు చెబుతున్నారు. 28 ఎకరాల విస్తీర్ణంలో మరో 50 ఏండ్లపాటు పనికి వచ్చే పెద్దపెద్ద భవనాలను కూల్చడమే కాకుండా, వందేళ్ల చరిత్ర కలిగిన దాదాపు వెయ్యి చెట్లను నరికి నయా సచివాలయాన్ని నిర్మించిన నాయకులు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు’ అని మంత్రి ఎద్దేవా చేశారు.
‘ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా ఫేక్ ఇమేజ్ లను, వీడియోలను సృష్టించి బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా విద్యార్ధులను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో చిచ్చుపెట్టే కుట్రలకు తెరలేపుతున్నారు.దాదాపు 25 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉన్న ఆ 400 ఎకరాలలో కొన్ని పిచ్చిమొక్కలు మొలిచాయి. కానీ బీఆర్ఎస్ ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తున్నట్లుగా అక్కడ ఏమీ లేదు. 111 జీవోను ఎత్తివేసి హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చే హిమాయత్ సాగర్, గండిపేట లక్షలాది ఎకరాల పరివాహక ప్రాంతం మొత్తాన్ని సర్వనాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ ది కాదా..?’ అని ప్రశ్నించారు.
‘ప్రగతి నిరోధక విధానాలను మార్చుకొని ప్రజల అభిమతానికి అనుగుణంగా మసలుకొండి. హెచ్‌సీయూ భూముల విషయంలో ఆనాడు కేసీఆర్ శాసనసభలో మాట్లాడిన విషయాన్ని ఆ పార్టీ నాయకులు ఒక సారి గుర్తుకు తెచ్చుకొని మాట్లాడాలి. ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టాలని ఆలోచన చేసింది. విద్యార్థులు ప్రతిఘటించడంతో వెనకకు తగ్గింది. ఈరోజు మాత్రం హెచ్‌సీయూకు ఎలాంటి సంబంధం లేని భూముల గురించి మాట్లాడడం బీఆర్ఎస్ ధ్వంధ్వ వైఖరికి నిదర్శనం’ అని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.