Karthi: మామూలుగా సీక్వెల్స్ అనేవి హిట్ అవ్వడం చాలా కష్టం. ఒక సినిమా ఏ హైప్ లేకుండా వచ్చి హిట్ అవ్వడం వేరు. దాని సీక్వెల్‌కు బాగా హైప్ క్రియేట్ అయ్యి ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం వేరు. అందుకే సీక్వెల్స్ అనేవి ఎక్కువగా హిట్ అవ్వవు. అయినా ప్రస్తుతం ప్రతీ భాషా పరిశ్రమలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. కథ కంటిన్యూ అవుతున్నా అవ్వకపోయినా.. ఇంకా ఏదో ఉంది అనే దగ్గర సినిమాను ఆపేసి సీక్వెల్‌లో చూసుకోండి అని చెప్పేస్తున్నారు మేకర్స్. అలా వచ్చిన వాటిలో చాలావరకు సీక్వెల్స్ ఫ్లాపే అయ్యాయి. కానీ కోలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కార్తి మాత్రం ఈ సీక్వెల్స్‌పైనే ఆధారపడుతున్నాడు.
రిస్క్ చేస్తున్నాడా.?
కోలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కార్తి ఒకడు. కార్తి ఒక సినిమాలో నటిస్తున్నాడంటే చాలు.. కచ్చితంగా అది బాగుంటుందని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. తమిళంలోనే కాదు తెలుగు ప్రేక్షకుల్లో కూడా కార్తి స్క్రిప్ట్ సెలక్షన్‌పై ప్రేక్షకులకు విపరీతమైన నమ్మకం ఉంది. అలాంటి కార్తి.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవి కాకుండా తను చేస్తున్న సినిమాలన్నీ తన మునుపటి సినిమాలకు సీక్వెల్సే. ఇది చూసిన ప్రేక్షకులు కార్తి ఒక విధంగా రిస్క్ చేస్తున్నాడని అనుకుంటున్నా.. తనపై నమ్మకంతో ఆ సీక్వెల్స్ అన్నీ హిట్ అవుతాయని నమ్మకం కూడా వ్యక్తం చేస్తున్నారు.
సీక్వెల్స్ సిద్ధం
ప్రస్తుతం కార్తి పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ‘సర్దార్ 2’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది. ఇక రెండేళ్ల క్రితం విడుదలయ్యి సూపర్ హిట్ అయిన ‘సర్దార్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతుంది కాబట్టి దీనిపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఉంది. ఇది కాకుండా కార్తి దగ్గర నుండి ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న మరో సీక్వెల్ ‘ఖైదీ 2’. లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన ‘ఖైదీ’.. దర్శకుడిగా తన జీవితాన్నే మార్చేసింది. అసలు ఒక హీరోయిన్ లేకుండా, ఒక పాట లేకుండా ఈ మూవీని ఎలా ఇంత ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించాడా అని అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. అందుకే ఇప్పుడు దీని సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: కూతురి టర్న్ అయిపోయింది, ఇప్పుడు కొడుకు వంతు.. హీరోగా ‘గేమ్ ఛేంజర్’ వారసుడు డెబ్యూ
ఫ్లాప్ సినిమా సీక్వెల్
హిట్ సినిమాల సీక్వెల్స్‌లో మాత్రమే కాదు.. ఫ్లాప్ సినిమా సీక్వెల్స్‌లో కూడా కార్తి (Karthi) నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల తన అన్న సూర్య హీరోగా నటించిన ‘కంగువా’ ఏ రేంజ్‌లో డిశాస్టర్‌ను మూటగట్టుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ క్లైమాక్స్‌లో కార్తి కూడా ఒక గెస్ట్ రోల్‌లో ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. కానీ దీని సీక్వెల్‌లో మాత్రం కార్తికి పూర్తిస్థాయి పాత్ర ఉండబోతుందని సమాచారం. ఇవి మాత్రమే కాకుండా నాని హీరోగా నటిస్తున్న ‘హిట్ 3’లో కూడా కార్తి ఒక గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడట. అంతే కాకుండా హిట్ ఫ్రాంచైజ్‌లో తరువాతి మూవీ అయిన ‘హిట్ 4’లో కార్తినే హీరోగా ఫిక్స్ అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.