Palnadu Water: తెలంగాణ ప్రజలకు కు చంద్రబాబు మోసం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణా – గోదావరిలో ఏపీ తన వాటా కంటే ఎక్కువ వాడుకుందని, మూడు నెలల్లో 90 లక్షల మంది 9 టీఎంసీల మంచి నీళ్లు తాగుతారా? అని నిలదీశారు. పల్నాడు గ్రిడ్ ప్రాజెక్టు పై సోమవారం జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్ ను బీఆర్ఎస్ నేతల బృందం కలిసి ఫిర్యాదు చేసింది. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కేఆర్ఎంబీ- కేంద్రానికి సమాచారం లేకుండా ఏపీ గ్రిడ్ ప్రాజెక్ట్ చేపడుతుందని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా నీళ్లను ఏపీ దోచుకుపోతుంటే తెలంగాణ నాయకులు సహకరిస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలం నుంచి ఇప్పటికే వేల టీఎంసీ లు దోచుకుపోతున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ నేతలు లొంగిపోయారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఫైట్ చేయకపోతే.. బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందన్నారు. ఇరిగేషన్ మంత్రి బ్లాస్టింగ్ లు జరుగుతుంటే ఎం చేస్తున్నారని నిలదీశారు. 24 గంటల పాటు కమిషన్ లు లెక్కపెట్టడంలో బిజీగా ఉన్నారా? అని ప్రశ్నించారు. మూడేళ్ళ నుంచి పొలాలు ఎండుతూనే ఉన్నాయి ఎందుకు? అని ప్రశ్నించారు.
మంత్రి ఉత్తమ్ కు ఎండిన పొలాలు కనిపించకపోతే మాతో వస్తే చూపిస్తామన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూఏపీ అక్రమంగా నీళ్లు తీసుకెళ్తుందని, హైదరాబాద్‌లో నీళ్ల కష్టాలు తీవ్రం అయిందన్నారు. భవిష్యత్ లో మంచినీటి సమస్య రావొద్దు అంటే ఏపీ అక్రమ ప్రాజెక్ట్ లను ఆపాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేతగాని తనం వల్లనే ఏపీ అక్రమంగా నీళ్లను తరలిస్తుందన్నారు. ఎమ్మెల్యే డి .సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ -కాంగ్రెస్ కుమ్మక్కు అయి హైదరాబాద్‌కు నీళ్ల కష్టాలు తెస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ కేసీఆర్ ఆదేశాల మేరకు మరోసారి జల ఉద్యమానికి బిఆర్ఎస్ శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ రాకముందు తాటిచెట్టంత కాలువలు తొవ్వి శ్రీ శైలం నుంచి జల దోపిడికి పాల్పడ్డారన్నారు. నేతల బృందంలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, అంజయ్య, రవీంద్రకుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ రావు,రాష్ట్ర నేతలు కిశోర్ గౌడ్, పల్లె రవికుమార్, చెరుకు సుధాకర్, లింగయ్యయాదవ్, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: పల్నాడు వాటర్ గ్రిడ్ వెనుక ఉన్న అసలు దొంగలు వీల్లే: చిట్టా విప్పిన సీఎం రేవంత్!