BRS: రైతులకో సమస్య వచ్చింది. పెద్ద మనిషిగా అక్కడికి వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇరువురికీ సర్ధి చెప్పి సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. మరింత పెద్దది చేశారు. కోపంలో ఓ కార్మికుడిని చెంప మీద కొట్టి.. ఆ గొడవను తనకే తగిలించుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే సారీ చెప్పే వరకూ తగ్గేదేలే అంటూ ఆ కార్మికులంతా ఆందోళనకు దిగారు. దీంతో చిక్కుల్లో పడ్డారు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్. ఇంతకీ అసలేం జరిగిందంటే..
కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని తీసుకునేందుకు రైస్‌మిల్లర్లు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి ధాన్యాన్నైనా తీసుకోవాల్సిందేనని ఆదేవాలు జారీ చేసింది. అయితే, అన్‌లోడింగ్ సమస్య ఉందని.. వాటిని పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందంటూ ఎప్పటికప్పుడు దాట వేస్తున్నారు. విషయం తెలిసి కామారెడ్డి కలెక్టర్ రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టి.. గట్టిగానే చెప్పారు. అయినా.. మళ్లీ అలానే కిరికిరి పెడుతున్నారు మిల్లర్లు.
ఈసారి మేటర్ ఎమ్మెల్యే గంప గోవర్థన్‌కు వరకూ వెళ్లింది. ఓ ప్రాంత రైతులు ఫోన్ చేసి రైస్ మిల్‌పై ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గోవర్థన్.. హుటాహుటిన పూర్ణిమ రైస్‌మిల్‌కు వెళ్లారు. అప్పటికే అక్కడ రైతులంతా గుమ్మికూడి ఉన్నారు. వారి సమక్షంలోనే తడిచిన ధాన్యాన్ని ఎందుకు తీసుకోవట్లేదంటూ రైస్ మిల్ సిబ్బందిని ప్రశ్నించారు. వారు చెప్పిన ఆన్సర్‌తో చిరాకొచ్చిన ఎమ్మెల్యే.. సిబ్బందిలో ఒకరి చెంప చెల్లుమనిపించారు. ఇదీ జరిగింది.
ఎమ్మెల్యేనే కదా కొడితే పడదాంలే అనుకునే రోజులు కావివి. అట్టెట్టా.. మమ్మల్ని ఎందుకు కొట్టారంటూ.. రైస్ మిల్ సిబ్బంది అంతా నిరసనకు దిగారు. లోడింగ్, అన్‌లోడింగ్ మొత్తాన్ని ఆపేసి ధర్నా చేపట్టడంతో వివాదం మరింత ముదిరింది. కొట్టినందుకు ఎమ్మెల్యే సారీ చెప్పాల్సిందేనంటూ.. పట్టుబడుతున్నారు మిల్లు కార్మికులు. మధ్యలో రైతులు నలిగిపోతున్నారు. ఈ గొడవ ముదిరి ఇంకెక్కడికి దారి తీస్తుందోననే టెన్షన్ అందరిలోనూ.