BRS Party: తెలంగాణలో అధికారం పోయిన తర్వాత కారు పార్టీ ఇబ్బంది పడుతోందా? అధికారంలో ఉన్నంత వరకు తమకు ఎదురులేదని నేతలు చెలరేగిపోయారా? బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి నేతలకు వర్తమానం వెళ్లిందా?
నేతలను ఎందుకు అలర్ట్ చేసినట్టు? రాబోయే ఇబ్బందులను ముందుగానే పార్టీ పెద్దలు ముందుగానే ఊహించారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. రేవ్ పార్టీ అనబడే ఫ్యామిలీ పార్టీ వ్యవహారంపై కొందరు బీఆర్ఎస్ నేతలు ఆవేశంలో ఊగిపోయారు.
మీడియా ముందుకొచ్చి కావాల్సిన మసాలా ఇచ్చేశారు ఆయా నేతలు. మీ ఇంట్లో లిక్కర్ తాగరా? నీవు తెలంగాణ కాదా? అంటూ మీడియా మిత్రులను ప్రశ్నించారు. దీనిపై ఇంట బయటా తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతోంది.
కారు పార్టీ నేతలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటూ కొన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసిన పని గురించి చెప్పాల్సింది పోయి.. తెలంగాణ సమాజం గురించి ఎలా మాట్లాడు తారంటూ మండిపడుతున్నారు. ఈ విషయం పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది.
ALSO READ: బీఆర్ఎస్ కు ఇద్దరు మహిళా నేతల రాజీనామా.. 23 ఏళ్ల రాజకీయానికి స్వస్తి.. అసలేం జరిగిందంటే?
అధిష్టానం నుంచి నేతలకు అలర్ట్ మెసేజ్‌లు వెళ్లాయట. ప్రస్తుతం తాము అధికారంలో లేమని, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన చేసింది. వేసే అడుగు.. మాట్లాడే ప్రతీ మాట జాగ్రత్తగా ఉండాలన్నది అందులోని సారాంశం.
చిన్నచిన్నవే పెద్ద కేసులు అవుతున్నాయని, బయట పరిస్థితులను గమనించి జాగ్రత్తగా అడుగులు వేయాలన్నది మరో పాయింట్. బయట పార్టీలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అలర్ట్ చేస్తున్నారట.
తాము అవినీతికి పాల్పడలేదు.. మాకేం కాదంటూ ఏమరుపాటుగా ఉండవద్దని పెద్దల నుంచి నేతలకు మెసేజ్ వెళ్లినట్టు పార్టీ వర్గాల మాట. బీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టేందుకు కొన్ని పార్టీలు రెడీ ఉన్నాయని గుర్తు చేశారట. కాంగ్రెస్ మాత్రమే కాదు.. బీజేపీ కన్ను మనపై పడిందని అంటున్నారట. మీరు.. మీ బంధువులు జాగ్రత్తగా ఉండాలంటూ వర్తమానం వెళ్లినట్టు శ్రేణుల మాట.