GHMC: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ఘనవ్యర్థాల నిర్వహణకు సంబంధించిన అంశాల్లో జీహెచ్‌ఎంసీ తగిన శ్రద్ధ చూపలేదని కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక నిగ్గు తేల్చింది. కాగ్ నివేదికలను సోమవారం సభలో పెట్టారు. నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణపై కాగ్ కీలక సూచనలు చేయటంతో 2002 మార్చినెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని కార్పొరేషన్ల పనితీరుపై ఈ నివేదికలో జీహెచ్‌ఎంసీ పరిధిలో జరుగుతున్న పలు లోపాలను వెలుగులోకి వచ్చాయి. ప్రాసెస్ చేయని చెత్తకు, ప్రాసెస్ జరిగినట్లు కాంట్రాక్టు సంస్థలకు రూ.313.20 కోట్లు చెల్లింపులు జరిగినట్లు నివేదికలో బయటపెట్టింది. డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ జరగకపోయినా చెల్లింపులు చేసినట్లు గుర్తించింది. చెత్త సేకరణ మొదలుకుని ప్రాసెసింగ్ వరకు, నిధుల వినియోగం నుంచి ఫీజుల వసూళ్ల వరకు పలు అంశాల్లో పాలనాపరమైన వైఫల్యాలున్నట్లు కాగ్ స్పష్టం చేసింది.
కొన్ని పనులకు సంబంధించి కేటాయించిన నిధులు ఆ పనులు చేపట్టకుండానే బిల్లుల చెల్లింపులు జరిగిన వ్యవహారాన్ని కూడా ఈ నివేదిక బయటపెట్టింది. పనుల నిర్వహణ లో లోపాలతో పాటు ఆదాయ వనరులున్నా, వాటిని సక్రమంగా వినియోగించుకోకపోవటంతో ఆదాయానికి కూడా భారీగా గండి పడినట్లు కాగ్ స్పష్టం చేసింది. తొమ్మిది స్థానిక సంస్థలు, ఒక గ్రామ పంచాయతీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుండి రావాల్సిన దాదాపు రూ. 47.77 కోట్ల టిప్పింగ్ ఫీజును వసూలు చేయడంలో జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహారించిన విషయాన్ని కూడా వేదికలో బయటపెట్టింది. ఇంకా, రైల్వే స్టేషన్ల వంటి భారీ వ్యర్థాల ఉత్పత్తి అయ్యే ప్రాంతాల నుంచి యూజర్ చార్జీల వసూలుపై ఎలాంటి సమీక్ష నిర్వహించనందున గణనీయమైన ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని కాగ్ నివేదిక ఆక్షేపించింది.
Also Read: Tax Disparity: బీజేపీ యేతర రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ: మంత్రి జూపల్లి
మున్సిపల్ ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ , డిస్పోజల్ పనులకు కాంట్రాక్ట్ పొందిన సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించినట్లు కాగ్ గుర్తించింది. పొడి చెత్తను ప్రాసెస్ చేయనప్పటికీ, సుమారు రూ. 44.16 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాల నిర్వహణ కోసం పనులను చేపట్టాల్సిన కాంట్రాక్టు సంస్థకు ఫిబ్రవరి 2012 నుండి జూలై 2020 మధ్య రూ. 313.20 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేయాల్సిన ప్రత్యేక నిధిని కూడా సదరు సంస్థ ఏర్పాటు చేయలేదని కాగ్ తన నివేదికలో తప్పుబట్టింది. భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన ’ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఫీజు’ వసూలు చేయడంలో జీహెచ్‌ఎంసీ విఫల్యాన్ని ఈ నివేదిక బట్టబయలు చేసింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 2.29 కోట్ల గండి పడిందని ఆడిట్ లెక్కల్లో కాగ్ తేల్చింది.
కాగ్ తన వార్షిక నివేదికల్లో ఒక వైపు లోపాలను ఎత్తిచూపుతూనే, పలు అంశాల్లో సంబంధిత శాఖల నిర్లక్ష్యాన్ని గుర్తించటంతో పాటు వ్యర్థాల నిర్వహణలో జీహెచ్‌ఎంసీ సాధించిన ఘనతను కూడా కాగ్ ప్రత్యేకంగా నివేదికలో ప్రస్తావించింది. ఉత్పత్తయ్యే మొత్తం చెత్తలో కేవలం 20 శాతం మాత్రమే ల్యాండ్‌ఫిల్ కు చేరాలన్న లక్ష్యాన్ని సాధించిన ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ గా జీహెచ్‌ఎంసీని గుర్తిస్తూ నివేదికలో ప్రశంసించింది. జవహర్ నగర్ ప్లాంట్ వద్ద చెత్త సేకరణ, రవాణా, శాస్త్రీయ పద్ధతుల్లో వేరు చేయడంలో ఇంకా మెరుగుపడాలని సిఫార్సులు చేసింది. ముఖ్యంగా నిర్మాణ వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడం వల్ల వేల టన్నుల చెత్త పేరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూనే మున్ముందు పని తీరులో మార్పు తెచ్చకునేలా, పెట్టుకున్న లక్ష్యాలను అధిగమించేందుకు వీలుగా కాగ్ సిఫార్సులను కూడా చేసింది. వ్యర్థాల సేకరణలో సోర్స్ సెగ్రిగేషన్ పకడ్బందీగా అమలు చేయాలని, చెత్త ఉత్పత్తి అయిన నివాసాలు, వ్యాపార సంస్థల వద్దే చెత్తను తడి,పొడి చెత్తగా వేర్వేరు చేయాలని సూచించింది. పెండింగ్‌లో ఉన్న యూజర్ చార్జీలు, టిప్పింగ్ ఫీజులను వెంటనే వసూలు చేసుకోవటంతో పాటు నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా జీహెచ్‌ఎంసీ తన పనితీరును మెరుగుపర్చుకోవాలని కాగ్ నివేదికల్లో సూచించింది.
Also Read: దిమ్మతిరిగేలా విజయ్ ఆస్తులు.. భార్య పేరు మీద ఎన్ని కోట్లు ఉన్నాయంటే?