ఎవరీ బీఎల్ఎన్ రెడ్డి?
స్వేచ్ఛ – బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్
⦿ కేసీఆర్ పాలనలో హెచ్ఎండీఏలో కీ రోల్
⦿ అక్రమ సంపాదనకు పెట్టింది పేరు
⦿ టెండర్ ఏదైనా తెలిసిన కంపెనీలకే
⦿ భారీగా కమీషన్లు.. డబ్బంతా రియల్ ఎస్టేట్‌కు మళ్లింపు
⦿ కొడుకు కంపెనీతో బ్లాక్ మనీ అంతా వైట్
⦿ ఫార్ములా ఈ – రేస్ కేసులో బుక్కైన బీఎల్ఎన్ రెడ్డి
⦿ ఇప్పటిదాకా చేసిన అక్రమాలు, అవినీతిపై స్వేచ్ఛ – బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809 :
Formula E Race Case: స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: సంచలనం రేపిన ఫార్ములా ఈ – రేస్ కేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ కేటీఆర్, అరవింద్ కుమార్ చుట్టూ సాగిన ఈ వ్యవహారంలో తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1 గా కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి పేర్లను పేర్కొంది. దీంతో బీఎల్ఎన్ రెడ్డి పేరు హాట్ టాపిక్ అయింది. స్వేచ్ఛ – బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం ఈయన గురించి ఆరా తీయగా, సంచలన నిజాలు తెలిశాయి. పదేళ్లపాటు కేసీఆర్ పాలనలో చేసిన అవినీతి, అక్రమాలతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం.
రూ.2వేల కోట్ల అక్రమ సంపాదన?
ఫార్ములా ఈ – రేసింగ్ కేసులో ఏ3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి పదేళ్లు హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌గా పని చేశారు. టెండర్ల ప్రక్రియతోపాటు సొమ్ము అంతా పక్కదారి పట్టించేది ఈయనేనని సమాచారం. అరవింద్ కుమార్ ఆదేశాల మేరకు ఏది చెబితే అది చేస్తుంటారని తెలుస్తోంది. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన ఈయన సుమారు రూ.2వేల కోట్ల దాకా సంపాదించారని టాక్. ఆ సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థల్లోకి మళ్లించి, కుమారుడి ద్వారా వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
అక్రమార్జనపై పోలీసుల ఫోకస్
ఏసీబీ కేసు నమోదైన తర్వాత ఫార్ములా ఈ – రేస్‌తోపాటు బీఎల్ఎన్ రెడ్డి అక్రమార్జన పైనా విచారణ జరిపేందుకు అధికారులు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ఈయనకి ఓ మహిళా అధికారితో సత్సంబంధాలు ఉన్నాయని, ఆమెను ఏడేళ్లలో చిన్నస్థాయి ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ స్థాయికి తీసుకెళ్లాడని ఉద్యోగుల్లో చర్చ ఉంది. అంతేకాదు, ఏ టెండర్ అయినా తనకు సంబంధించిన కంపెనీలకు అప్పగించుకుని భారీగా లబ్ధి పొందడం, కమీషన్లు తీసుకోవడం ఈయనకు అలవాటుగా చెబుతున్నారు. హెచ్ఎండీఏలో పదేళ్లలో జరిగిన అవినీతికి ఈయన కేరాఫ్‌గా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఈ బాగోతాలపై దృష్టి పెట్టారని, ఇందులో ఎవరెవరికి వాటాలు ఉన్నాయో విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
స్వేచ్ఛ – బిగ్ టీవీలో వరుస కథనాలు
హెచ్ఎండీఏ టెండర్ల అంశంలో బీఎల్ఎన్ రెడ్డి పాత్ర చాలా కీలకం. దీంతో అక్రమార్జన అలవాటుపడి భారీగా సంపాదించినట్టు సమాచారం. ఈయన అవినీతి బాగోతాలపై స్వేచ్ఛ – బిగ్ టీవీలో వరుస కథనాలు రానున్నాయి. సంపాదనను రియల్ ఎస్టేట్‌లోకి తీసుకెళ్లి కొడుకు ద్వారా పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారని తెలుస్తోంది. రిటైర్ అయ్యాక కూడా ఈయన్ను కేసీఆర్ ప్రభుత్వం కొనసాగించింది. ప్రభుత్వం మారాక సైలెంట్‌గా సైడ్ అయిపోయారు. కుమారుడితో భూములు కొనుగోలు చేసి బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వ్యవహారాలపై స్వేచ్ఛ – బిగ్ టీవీ వరుస కథనాలు ఇవ్వనుంది.