CBI ON Kaleshwaram: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ ఎంట్రీ ఇచ్చేసింది. గురువారం నుంచి అధికారులు ప్రాథమిక విచారణ మొదలుపెట్టారు. ప్రాజెక్ట్‌లో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై తొలుత దృష్టి సారించారు.
ఎట్టకేలకు తెలంగాణలో కేసులపై సీబీఐ ఫోకస్ చేసింది. ఇప్పటికే అడ్వకేట్ వామనరావు దంపతుల కేసు దర్యాప్తు చేస్తోంది. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో గురువారం నుంచి ప్రాథమిక విచారణ చేపట్టింది. ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. తొలుత నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ- NDSA రిపోర్టు, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్స్‌లను పరిశీలన చేస్తోంది.
ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు సీబీఐ. ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. దీని ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు, అధికారులు, కాంట్రాక్టర్లను విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని రేవంత్ సర్కార్ ఆరోపిస్తోంది. తాజాగా సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ మొదటి వారంలో సీబీఐకి లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన విచారణలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం మూడు బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణ, ఆపరేషన్, నిర్వహణ, ఆర్థిక నిర్వహణలో తీవ్రమైన లోపాలను గుర్తించినట్టు పేర్కొంది.
ALSO READ: శంషాబాద్‌లో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు
అలాగే కాళేశ్వరం కార్పొరేషన్, అంత రాష్ట్ర అంశాలపై విచారించాలని పేర్కొంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయాలను ప్రస్తావించింది. దీనికితోడు ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రైవేట్ కంపెనీలపై విచారణ జరపాలని కోరిన విషయం తెల్సిందే.
మేడిగడ్డ బ్యారేజీలోని బ్లాక్-7లోని పిల్లర్లు కుంగిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ క్రమంలో NDSA బృందం అక్టోబర్ 24, 2023న ఆ ప్రదేశాన్ని పరిశీలించింది. ఆ తర్వాత మూడు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.
నవంబర్ 1, 2023న ప్రాథమిక నివేదిక ఇచ్చింది. మే 1, 2024న మధ్యంతర నివేదిక అందజేసింది. చివరగా ఏప్రిల్ 24, 2025లో తుది నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. పేలవమైన ప్రణాళిక, డిజైన్ లోపాలు, నాణ్యతా నియంత్రణ లేకపోవడం, బలహీనమైన పర్యవేక్షణ కారణంగా పిల్లర్లు కుంగినట్టు తేల్చింది.