
Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో.. ఆ ప్రాంతాన్ని ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటి.. శనివారం రాత్రి అసలేం జరిగిందో స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజ్ పరిస్థితిని అంచనా వేసి కేంద్రానికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనుంది. ఆరుగురు సభ్యుల బృందం.. బ్యారేజ్ డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తుంది. ఎక్కడెక్కడ పిల్లర్లు కుంగాయి? ఎక్కడెక్కడ పగుళ్లు వచ్చాయి? కుంగిన పిల్లర్లతో పాటు మిగతా పిల్లర్ల పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలపై అధ్యయనం చేస్తోంది. బ్యారేజ్‌ను నిర్మించిన సంస్థలతో చర్చించడంతో పాటు.. ఇరిగేషన్, ప్రభుత్వ అధికారులతోనూ సంప్రదింపులు జరపనుంది. ఆ తర్వాత బ్యారేజ్ పరిస్థితిపై కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇస్తుంది. కేంద్ర బృందంలో అనిల్‌జైన్, ఎస్.కె.శర్మ, తంగమణి, రాహుల్ కె.సింగ్, దేవేందర్ రావు ఉన్నారు.
మేడిగడ్డ బ్యారేజీని మొత్తం 7 బ్లాకులుగా నిర్మించారు. ఇది మహారాష్ట్ర వైపు చివరిలో ఉంది. దీనిలోని పిల్లర్లే ప్రస్తుతం కుంగిపోయాయి. కేంద్ర బృందం బ్యారేజీకి జరిగిన నష్టంపై అంచనా వేసి నివేదిక ఇచ్చాక.. ఆ బృందం సిఫార్సుల ఆధారంగా చర్యలు చేపడతారు. మరోవైపు బ్యారేజీ కుంగిపోవడంతో ఇప్పటికే నీటిని మొత్తం దిగువకు వదిలేసి.. అధికారులు ప్రాజెక్టును ఖాళీ చేశారు. ప్రస్తుతం వచ్చిన నీళ్లు వచ్చినట్లే దిగువకు వెళ్లిపోతున్నాయి.
ఇక బ్యారేజ్ దగ్గర అధికారులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. విపక్ష పార్టీలు బ్యారేజ్ సందర్శనకు వస్తుండటంతో.. ఆ ప్రాంతానికి ఎవరూ రాకుండా, 144 సెక్షన్ అమల్లో ఉందని చెబుతున్నారు. ఎవరైనా వచ్చినా బ్యారేజ్ దగ్గరికి అనుమతించకుండా.. బలవంతంగా వెనక్కి పంపించేస్తున్నారు. దాంతో.. విపక్ష పార్టీలు అధికార బీఆర్‌ఎస్‌పై భగ్గుమంటున్నాయి. లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతో.. ప్రజాధనమంతా వృథా అయిందని, దీనికి కారణం సీఎం కేసీఆరే కాబట్టి.. మేడిగడ్డ కుంగుబాటుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.