Twist on phone tapping case: ఎట్టకేలకు చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో హరీష్ రావు పీఏ వంశీకృష్ణ, సంతోష్ కుమార్ తోపాటు పరశురాములు ఉన్నారు.
ముగ్గురు చిక్కారు
సిద్దిపేట్ కు చెందిన రియల్టర్ చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్‌పై గతేడాది పంజాగుట్టు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి హరీష్‌రావు న్యాయస్థానం గడప తొక్కారు. కాకపోతే న్యాయస్థానం నుంచి ఆయనకు స్వల్ప ఊరట మాత్రమే లభించింది. అంతేకానీ కేసు మాత్రం కొట్టి వేయలేదు.
ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆనాడు ఫోన్ ట్యాపింగ్ లో సహకరించిన హరీష్‌రావు పీఏ వంశీకృష్ణ, సంతోష్ కుమార్ తోపాటు పరశురాములను అరెస్ట్ చేశారు. వారికి న్యాయస్థానం ముందు పోలీసులు హాజరుపరిచారు. ఈనెల 28 వరకు డిమాండ్ విధించింది.
ఆరోగ్యశాఖ మంత్రిగా హరీష్‌రావు ఉన్న సమయంలో ఆయన పేషీలో పని చేశాడు వంశీకృష్ణ. ఆయన సొంతూరు సిద్ధిపేట్. కొంతకాలం నల్గొండ జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ గా వ్యవహరించాడు. అక్కడ అక్రమాలకు పాల్పడి నట్టు గుర్తించడంతో ఆయన్ని తొలగించారు ఉన్నతాధికారులు. 2023లో ఆనాటి మంత్రి హరీష్ రావు పేషీలో ఉద్యోగిగా చేరాడు. దాదాపు ఆరునెలల పాటు పని చేశాడు.ః
ALSO READ: తెలంగాణలో మరోసారి కులగణన సర్వే.. పోన్ చేస్తే ఇంటికి వచ్చి వివరాలు నమోదు
అసలేం జరిగింది?
అదే సమయంలో సిద్ధిపేట్ లోని భవానీ కమ్యూనికేషన్స్ నిర్వాహకుడు సంతోష్ కుమార్, కారు డ్రైవర్ పరశురాములతో పరిచయం ఏర్పడింది. మరణించిన వ్యక్తి గుర్తింపు కార్డు, అతడు ఉపయోగించిన సిమ్ కార్డు వీరంతా వినియోగించుకోవడం మొదలుపెట్టారు. ఆ నెంబర్ ద్వారా అక్రమ కార్యకలాపాలకు తెరలేపారు.
ఇదే క్రమంలో సిద్ధిపేట్ రియల్టర్ చక్రధర్ గౌడ్ కు ఫోన్‌కు అదే నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ చేసి బెదిరించడం మొదలుపెట్టారు. ఆపై డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత చక్రధర్ గౌడ్ పంజాగుట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తులో నిమగ్నమయ్యారు.
చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేసిన ఫోన్ నెంబర్ ఆధారంగా కూపీ లాగారు పోలీసులు. దీంతో తీగ లాగితే అసలు డొంక అంతా కదిలింది. హరీష్ రావు పేషీ మాజీ ఉద్యోగి వంశీకృష్ణ సాగించిన కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఆరోగ్యశ్రీ లో పని చేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు హరీష్ రావు పీఏ వంశీకృష్ణ. ఆ వ్యవహారంలో కీలక నిందితుడుగా ఉన్నాడు.
మరోవైపు ఈ కేసులో రెండుసార్లు జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు చక్రధర్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. తన వద్దనున్న ఆధారాలను పోలీసులకు అందజేశారు. దాని ఆధారంగా దర్యాప్తులో నిమగ్నమయ్యారు. గతంలో హరీష్ రావు ఎన్నికల్లో ఓడిపోతాడనే భయంతో తన ఫోన్ ట్యాప్ చేశాడని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన రంగనాయక సాగర్ స్కామ్ బయట పెట్టానని, ఈ క్రమంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారన్నది బాధితుడి వెర్షన్. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.