Chamala Kiran: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ‘ఆట మొదలైంది.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే’ అంటూ కిషన్ రెడ్డి పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఆట ఆడుతున్న బీజేపీ తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క గోల్ కూడా కొట్టలేదని విమర్శించారు.
స్క్రిప్ట్ బీఆర్ఎస్ది.. ప్రజెంటేషన్ బీజేపీది
దేశవ్యాప్తంగా బత్తాయి పండు ఆరెంజ్ రంగులో ఉంటే.. తెలంగాణలో మాత్రం అది పింక్ కలర్లోకి మారిపోయిందని చామల అన్నారు. ఆరెంజ్ కాస్తా పింక్ రంగుగా మారడాన్ని తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తోందని అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ వెనుక ఉండి డబ్బింగ్ చెబుతుంటే.. కిషన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతున్నారని ఆరోపించారు. మొత్తం మీద స్క్రిప్ట్ బీఆర్ఎస్ పార్టీది అయితే.. ప్రజెంటేషన్ మాత్రం బీజేపీది అన్నట్లుగా ఉందని విమర్శించారు.
అభివృద్ధిపై బీజేపీ స్టాండ్ ఏంటి?
రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చిందని మాట్లాడుతున్న కిషన్ రెడ్డికి అసలు తెలంగాణపై ప్రేమ ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి నిధులు తెచ్చే లైన్ మీదా, లేక నిధులను అడ్డుకునే లైన్ మీదా అని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను నిలదీశారు. మూసీ నది ప్రక్షాళన, హైదరాబాద్ మెట్రో విస్తరణ జరగవద్దా? ప్రజలు ఇంకా మూసీ మురికిలోనే మగ్గిపోవాలా? అని ఫైర్ అయ్యారు. దేశంలోని జీసీసీలలో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంటే.. విదేశీయుల వీసాలు రద్దయినప్పుడు కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
ఆర్టీసీ బస్సు ఎప్పుడైనా ఎక్కారా?
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలపై కిషన్ రెడ్డి చేస్తున్న విమర్శలను చామల తనదైన శైలిలో తిప్పికొట్టారు. అసలు కిషన్ రెడ్డి ఎప్పుడైనా ఆర్టీసీ బస్సు ఎక్కారా అని ప్రశ్నించారు. అసలు ఏ ఆధారంతో ప్రజలు బీజేపీని నమ్మి అధికారంలోకి తెస్తారని నిలదీశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దని, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే కేంద్ర మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎంపీ చామల మండిపడ్డారు.
Also Read: కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువైంది.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ ఫోకస్!