Chief Minister Revanth Reddy: పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో కలిసి కంపెనీలు ముందుకు వస్తే అద్భుతాలు చేయవచ్చన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా చేయడమే తమ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీని నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెప్పుకొచ్చారు.
శుక్రవారం హైటెక్ సిటీలో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఈవీ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టామన్నారు. ఆయా వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు ట్యాక్స్ తొలగించామని వివరించారు.
హైదరాబాద్ సిటీని వరదలు లేని నగరంగా తీర్చి దిద్దాలన్నదే తమ ఆలోచనగా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. చంద్రమండలానికి వెళ్తున్నామని, కానీ భూమిపై ఎలా ఉండాలో మాత్రం తెలుసుకోలేకపోతున్నామన్నారు. కాలుష్య కారక వాహనాలను అవుటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలిస్తున్నామని తెలిపారు.
మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తూ రోడ్డు, రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం. రీజనల్ రింగ్ రైల్వే లైన్ మంజూరు చేయాలని ప్రధాని మోదీని కోరామన్నారు. చైనా తరహాలో క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు-రీజనల్ రింగ్ రోడ్డు మధ్య రేడియల్ రోడ్లు నిర్మిస్తామని గుర్తు చేశారు.
ALSO READ: ఫార్ములా కేసు విచారణ.. ఏసీబీ ముందు బీఎల్ఎన్‌రెడ్డి, వచ్చేవారం నుంచి
అభివృద్ధితోపాటు ఇక్కడ యువతకు ఉపాది కల్పించాలన్నది తమ ఉద్దేశంగా చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణలో ప్రతి ఏడాది లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టా పట్టుకుని బయటకు వస్తున్నారని, వారిలో ఎక్కువ మంది స్కిల్ ఉండలేదన్నారు. టాటా గ్రూప్‌తో కలిసి రూ. 2400 కోట్లతో రాష్ట్రంలో ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని గుర్తు చేశారు.
నైపుణ్యాల పెంపు కోసం ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, అందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఐఎస్‌బీ తరహాలో స్కిల్ యూనివర్సిటీ కోసం ఆనంద్ మహీంద్రాను ఛైర్మన్‌గా నియమించామని గుర్తు చేశారు. స్కిల్ యూనివర్సిటీ కార్పస్ ఫండ్ కోసం సీఐఐ ప్రతినిధులు మద్దతు ఇవ్వాలన్నారు.
అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, రానున్న 50 ఏళ్ల కోసం ప్రణాళికలు రచిస్తున్నామని తెలియజేశారు. సీఐఐ ప్రతినిధులు ఎప్పుడైనా వచ్చి తనను కలవచ్చని, మా ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.
తెలంగాణలో స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని వివరించారు సీఎం రేవంత్. ప్రభుత్వ కార్యాలయాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలతో క్యాంటీన్లు ఏర్పాటు చేయించామన్నారు. వారితో సోలార్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేయిస్తున్నామన్నారు.
1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసేలా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. హైటెక్ సిటీ పక్కనే మహిళా సంఘాల ఉత్పత్తులను విక్రయించు కునేందుకు మూడున్నర ఎకరాల స్థలంలో స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని, గ్రామీణ మహిళల సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.