2024 Earth’s Hottest Year | 2024 అంటే గత సంవత్సరం భూగోళానికి అత్యంత హాటెస్ట్ ఇయర్ అని రికార్డ్ అయింది. ఈ రికార్డులు చూస్తే.. భూగోళానికి హీట్ వేవ్ ప్రమాదాలు భవిష్యత్తులో కూడా పొంచిఉన్నాయని భయాందోళనలు కలుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు మానవ నివాస గ్రహంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. వాతావారణంలో ఈ తీవ్ర మార్పులకు కారణమేంటి? ఇదంతా మానవ స్వకృతాపరాధం వల్లే జరుగుతోందా? అనే ప్రశ్నలు తల్లెత్తుతున్నాయి.
సూర్యుడు భూగ్రహంపై నిప్పులు చెరగడంలో ప్రపంచవ్యాప్తంగా 2024లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రపంచదేశాల్లో ప్రజలు సూర్యుడు తాపానికి విలవిల్లాడారు. ఫలితంగా అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డు సృష్టించింది. పారిస్ అగ్రీమెంట్ ప్రకారం.. ప్రపంచ ఉష్ణోగ్రత సగటున 1.5 డిగ్రీ సెల్సియస్ దాటకూడదు. కానీ ఈ సగటు గణాంకాలను 2024 సంవత్సరం దాటేసిందని కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ ఇటీవలే నివేదిక జారీ చేసింది. ప్రపంచంలోని చాలా వాతావరణ మానిటరింగ్ ఏజెన్సీలు 2024లో సగటు ఉష్టోగ్రత 1.6 డిగ్రీ సెల్సియస్ గా నమదైందని తెలిపాయి. ఈ గణాంకాలు 2023 సంవత్సరం కంటే చాలా ఎక్కువ. దీంతో గ్లోబల్ వార్మింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
1991-2020 అంటే గత 30 సంవత్సరాల సగటు ఉష్ణోగ్రతలతో పోల్చితే 2024 జనవరి నుంచి నవంబర్ మధ్య కాలంలో ఉష్ణోగ్రత 0.72 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా నమోదైంది. సాధారణంగా నవంబర్ నెలలో వాతావరణంలో వేడి ఉండదు. అలాంటిది నవంబర్ లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావడంతో హీట్ వేవ్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా 2023 నవంబర్ లో కూడా జరిగింది. కానీ 2024 నవంబర్ నెలలో ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా నమోదయ్యాయి. నవంబర్ నెలలో ఉపరితల గాలి సగటు ఉష్ణోగ్రత 14.10 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. ఇది 1991-2020 మధ్య కాలంలో నమోదైన ఉష్ణోగ్రతల కంటే 0.72 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ. అలాగే నవంబర్ 2024లో గ్లోబల్ వార్మింగ్ కూడా రికార్డు సృష్టించింది. ఈ నెలలోనే పరిశ్రమల వల్ల పెరిగిన వేడి ఇంతకుముందు కంటే 1.62 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా నమోదైంది.
వాతావరణంలో ఈ తీవ్ర మార్పులకు ప్రధాన కారణం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని నిపుణలు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్, ఇతర పారిశ్రామక రసాయనాల వేడి మిశ్రమ కాలుష్యంతో వాతావరణం ప్రతికూల ప్రభావం చూపాయి. ముఖ్యంగా వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్లే వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్, ఇతర కాలుష్య కారక వాయువు (గ్యాస్)ల స్థాయి తీవ్రంగా పెరిగిపోతోంది. దీని వల్ల వాతావరణం వేగంగా వేడెక్కుతుంది. ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. అంటే సముద్రంలోని నీరు వేడెక్కి సముద్ర మట్టం అనూహ్యంగా పెరిగపోతుంది, హిమ పర్వాతాలు కరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఒకచోట కరువు, మరోచోట వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి.
నిజానికి భారీ ఉష్ణగ్రోతలకు సముద్ర వాతావరణంలో వచ్చే ఎల్ నీనో ప్రభావ కారణమని కొందరు వాదిస్తున్నా.. పరిశోధకులు మాత్రం ఎల్ నీనో ప్రభావం తాత్కాలికమేనని అభిప్రయాపడుతున్నారు. కానీ మానవుల వల్ల అంటే పరిశ్రమల నుంచి కలిగే కాలుష్యం, ఇంధన కాలుష్యం తో దీర్ఘకాలిక సమస్యలు వస్తాయనేది కాదనలేని నిజం.
ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్ జరగడంతో 2024లో ప్రపంచవ్యాప్తంగా 140 బిలియన్ డాలర్ల భారీ నష్టం జరిగిందని అంచనా. ప్రపంచ దేశాల్లో అన్నింటికంటే ఎక్కువగా ఉత్తర అమెరికా ఖండం (అమెరికా, కెనెడా) పై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కనిపించింది. అక్కడ వరదలు, భారీ తుపాన్లు, కార్చిచ్చుల వల్ల అడవులు కాలిపోవడం వంటి దుర్ఘటనలు జరిగాయి. దీంతో వెంటనే వాతావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని దేశాలన్నీ భావిస్తున్నాయి.
ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ సగటున దాటేయడం తాత్కాలికమే అయినా గ్లోబల్ క్లైమేట్ టార్గెట్స్ ని మాత్రం అన్ని దేశాలు పాటించాల్సిన అవసరముంది. శాస్త్రవేత్తల ప్రకారం.. 1.5 డిగ్రీ సెల్సియస్ అనేది ఒక టార్గెట్ నెంబర్ మాత్రమే కాదు.. ఇది ఒక డేంజర్ సిగ్నల్. హిమ పర్వతాలు కరిగిపోవడం, సముద్రంలోని జీవరాశి చనిపోతుండడం మానవజాతికి హెచ్చరికలు లాంటివి. అందుకే ప్రపంచ దేశాలన్నీ 2015 వాతావరణ పరిరక్షణ కోసం పారిస్ అగ్రీమెంట్ ని సీరియస్ గా పాటించాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.
మానవులు వాతావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే.. భవిష్యత్తులో ప్రకృతి ప్రకోపం ఇంకా తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2025 సంవత్సరం ప్రారంభంలోనే అమెరికాలోని క్యాలిఫోర్నియా అడువుల కార్చిచ్చు ప్రమాదమే ఇందుకు ఉదాహరణ. ఈ సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలు చవిచూడాల్సి ఉంటుందని నిపుణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.