Raja Singh: జైలు నుంచి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చికోటి ప్రవీణ్ కలిశారు. భారీ ర్యాలీతో ధూల్ పేటలోని రాజాసింగ్ ఇంటికి వెళ్లి మరీ ఆయన్ను పరామర్శించారు. హిందూ ధర్మం కోసం పోరాడే వారందరికీ అండగా ఉంటానన్నారు చికోటి ప్రవీణ్.
ఇంతకీ చికోటి ప్రవీణ్ ఎవరో తెలుసుగా. గోవా, నేపాల్ లో క్యాషినోలు నిర్వహించారంటూ ఇటీవల ఈడీ విచారణ ఎదుర్కొన్నారు చికోటి. హైదరాబాద్ నుంచి బడా వ్యాపారులు, సెలబ్రెటీస్ ను గోవా, నేపాల్, శ్రీలంకలకు తీసుకెళ్లి, వారికి సకల సౌకర్యాలు కల్పించి.. క్యాషినో బిజినెస్ చేసేవాడనేది ప్రవీణ్ పై ఉన్న ఆరోపణలు. హవాలా పద్దతిలో నగదు లావాదేవీలు జరిపే వారని.. ఆ మనీలాండరింగ్ గుట్టు రట్టు చేయడానికే చికోటి ప్రవీణ్ ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఆ కేసుపై ఇంకా విచారణ జరుగుతోంది. ఈ సమయంలో.. ఆయన బీజేపీ ఎమ్మెల్యేను కలవడం ఆసక్తికరంగా మారింది. చికోటి కాషాయ కండువా కప్పుకోనున్నారా? అనే అనుమానమూ వ్యక్తం అవుతోంది.
అయితే, తాను బీజేపీలో చేరే ప్రచారాన్ని ఖండించారు ప్రవీణ్. తనకు అన్ని పార్టీల వారితో సంబంధాలు ఉన్నాయని.. ప్రస్తుతం ఏ పార్టీలో చేరే ఆలోచన లేదంటూ క్లారిటీ ఇచ్చారు. హిందుత్వ వాదిగా మాత్రమే ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలిశానని చెప్పారు. పైకి కాదు కాదంటున్నా.. లోలోన ఏదో జరుగుతోందనే అనుమానమైతే లేకపోలేదు.