New Year 2025 : మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది అడుగు పెట్టబోతోంది. దీంతో న్యూ ఇయర్ వేడుకలకు ఇప్పటి నుంచి నగరం సిద్ధమవుతోంది. అర్థరాత్రి వేళ నూతన ఏడాదిని.. వెలుగుగొలిపే విద్యుత్ దీపాలు, ఆటపాటల మధ్య ఆహ్వానించేందుకు యువత, నగర ప్రజలు ఆసక్తిగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో.. న్యూ ఇయర్ వేడుకలపై నగర పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ రోజు అనుసరించాల్సిన విధివిధానాలపై నగర పోలీసులు క్లారిటీ ఇచ్చేశారు.
హైదరాబాద్ మహానగరంలో పబ్బులు, స్టార్ హోటళ్లు, బార్లపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు హైదరాబాద్ నగర పోలీసులు వెల్లడించారు. వేడుకల పేరుతో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. నగరంలో డ్రగ్స్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. డ్రగ్స్ కట్టడికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక మార్లు పోలీసులు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి, స్పష్టమైన మార్గదర్శకాలు చేశారు. దీంతో.. డ్రగ్స్ రహిత రాష్ట్ర నిర్మాణంలో భాగంగా.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు దృష్టి సారించారు. కొత్త ఏడాది వేడుకల సమయంలో డ్రగ్స్ వినియోగించే అవకాశం ఉండడంతో.. పోలీసుల నిఘా మరింత పెరగనున్నట్లు సీపీ ఆనంద్ వెల్లడించారు.
న్యూ ఇయర్ వేడుకల రోజున నగరం మొత్తం అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాల వారు వేడుకలు నిర్వహిస్తుంటారు. దీంతో.. మిగతా రోజుల్లో మాదిరి పోలీసు సిబ్బంది సరిపోరు. దాంతో.. అనేక ప్రాంతాల్లో సిబ్బంది కొరత ఏర్పడుతుంటుంది. దీన్ని ఆసరాగా చేసుకునే.. డ్రగ్స్ వినియోగదారు, సరఫరాదార్లు రెచ్చిపోతుంటారు. రహస్య ప్రాంతాలకు వెళ్లి డ్రగ్స్ సేవిస్తూ, ఎంజాయ్ చేస్తుంటారు. కానీ.. ఈ సారి మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నట్లు నగర పోలీసులు తెలిపారు. నిషేధిత మాదక ద్రవ్యాలు వినియోగిస్తే ఆయా పబ్బులు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా పబ్బులను సీజ్ చేస్తామని, వాటిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇప్పటికే పోలీస్ నిఘా బృందాలు నగరంలో సీక్రెట్ గా డ్రగ్స్ వినియోగించేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై నిఘా పెట్టినట్లు తెలిపిన పోలీస్ కమిషనర్ సీపీ ఆనంద.. ఆయా ప్రాంతాల్లోకి వచ్చేవారిపై చర్యలుంటాయని, పోలీసులు అనుమతించిన ప్రదేశాల్లోనే వేడుకలు నిర్వహించుకోవాలని, ఆయా ప్రాంతాల్లోనే సంచరించాలని సూచించారు. మారుమూల ప్రాంతాలకు, నిర్మానుష ప్రాంతాల్లో కొత్త ఏడాది ఉత్సవాల పేరుతో ప్రవేశించవద్దని సూచించారు. డ్రగ్స్ విక్రయించే ముఠాలకు చెందిన వ్యక్తులను ముందుగా టార్గెట్ చేయనున్నట్లు తెలిపిన పోలీసులు.. వినియోగించిన వారు పట్టుపడినా చట్టప్రకారం కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
న్యూ ఇయర్ రోజున షీ టీమ్స్ తో నగరం మొత్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వేడుకలు, ఉత్సవాలు పేరుతో ఆడవారు, చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, మద్యం మత్తులో వారి పట్ల చెడుగా వ్యవహరించినా కేసులు నమోదు చేస్తామ,ని యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. న్యూ ఇయర్ రోజున నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.. ఆ రోజున మద్యం సేవించి వాహనాలు నడిపినా, ర్యాష్ డ్రైవింగ్ చేసి పట్టుబడినా చర్యలు తప్పవన్నారు.
అనుమతులు తప్పనిసరి
స్నేహితులు, బంధువులు, ఎవరైనా గుమ్మిగూడి వేడుక నిర్వహించుకోవాలి అనుకుంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందేనని నగర పోలీసులు తెలిపారు. కనీసం 15 రోజుల ముందే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని, వేడుకలు నిర్వహిస్తున్న ప్రదేశాల్లో తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందేనని సూచించారు. వేడుకలలో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అలాంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. వేడుకల పేరుతో చుట్టుపక్కల వారికి, సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దని సూచించిన నగరస్ సీపీ సీవీ ఆనంద్.. అవుట్ డోర్ లో రాత్రి 10 గంటల వరకు మాత్రమే సౌండ్ సిస్టమ్స్, మ్యూజిక్స్ కు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇన్ డోర్లో మాత్రం.. రాత్రి 1:00 వరకు మ్యూజిక్ ప్లే చేసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. స్టేడియాలు, ఇతర ఇండోర్ ప్రదేశాల్లో నిర్వహించుకునే వేడుకలకు.. సామర్ధ్యానికి మించి టికెట్లు, పాసులు మంజూరు చేయవద్దని అలా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. నగరంలో న్యూ ఇయర్ వేడుకలలో శాంతి భద్రతలకు ఎలాంటివి విఘాతం కలిగించిన కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.