CM Revanth Reddy:నల్లమల బిడ్డగా తరుచూ ప్రస్తావించుకునే రేవంత్ రెడ్డి.. సీఎం హోదాలో నేడు తొలిసారి ఆ ప్రాంతంలో పర్యటించున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా మాచారంలో ఇందిరా సౌర గిరి జల వికాస పథకానికి రేవంత్ రెడ్డి అంకురార్పణ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చెంచులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా చేయూతనందిస్తుంది. ఈ పథకం ద్వారా చెంచుల కష్టాలు తొలగి.. శాశ్వత జీవనోపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ రానున్న ఐదేళ్లలో సోలార్ పంపుసెట్ల ద్వారా నీరు అందించాలనేది ఈ పథకం లక్ష్యం. విద్యుత్ సదుపాయం లేని పోడు భూములకు పూర్తి రాయితీతో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసి నీరు అందించనున్నారు.
23 మంది చెంచు రైతులకు సౌర పలకలు, పంపు సెట్లను సీఏం పంపిణీ చేస్తారు. అక్కడ నుంచి ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లి.. పలు అభివృద్ది కార్యక్రమాలకు భూమి పూజ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరా గిరి జల వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తోంది. ఆర్‌వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్న రైతులకు ఈ పథకం వర్తించనుంది. ఐదేళ్లలో 2లక్షల 10 వేల మంది గిరిజనులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించనున్నారు. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఈ పథకం ఉద్దేశ్యం.
రాష్ట్రంలో పోడు భూములను వ్యవసాయానికి పనికొచ్చేలా తీర్చిదిద్ది, మెరుగైన ఉత్పాదకత సాధించడం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వం. ఓ వైపు వ్యవసాయ భూ విస్త్రీర్ణం పెంచడంతో పాటు.. మరో వైపు గిరిజన రైతులకు చేయూతనిచ్చేందుకు ఈ పథకం వీలుపడుతోంది. ఇందుకోసం రానున్న ఐదేళ్లలో ప్రభుత్వం 12వేల 600 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నెల 25 వరకు మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించి, జూన్ 10 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. భూగర్భ జలాల సర్వే పనుల్ని గిరిజన సంక్షేమశాఖ చేపడుతుంది.
జూన్ 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరుబావుల తవ్వకం, సోలార్ పంపుసెట్ల ఏర్పాటు పనుల్ని ఫినిస్ చేస్తారు. మొదటి ఏడాదిలో 27వేల 184 ఎకరాలను సాగులో తీసుకురావాలని టార్గెట్. దీని కోసం 600 కోట్లు ఖర్చుచేసి 10 వేల మంది పంపు సెట్లు పంపిణీ చేయనున్నారు.
Also Read: పాక్ కిస్సా ఖల్లాస్..! ఆ 108 కిలోమీటర్ల బోర్డర్ ఎందుకంత కీలకం
నల్లమల నుంచి అటవీ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయని, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కునేందుకు ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా దాదాపు పదివేల మంది చెంచులు లబ్దిపొందనున్నారు. మాచారంలో ఉన్న దాదాపు 50 చెంచు కుటుంబాలు ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ద్వారా లబ్దిపొందనున్నారు. 175 ఎకరాల్లో వివిధ పండ్ల తోటల సాగుకు తోడ్పాటు అందించనున్నారు. ఐదేళ్లలో ఆరు లక్షల ఎకరాలల్లో పోడు భూములకు సాగు నీరు అందించనున్నారు.