Cm Revanth on KCR KTR: మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల సమస్యలు తీరుస్తుంటే కంటికి మంటగా ఉందా.. మీకు నల్గొండ ప్రజలు ఓట్లేయలేదని కోపమా.. కేసీఆర్ తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రజల ఉసురు తగులుతుంది.. బుల్డోజర్లకు అడ్డం పడతారా రండి.. మా వెంకన్న బుల్డోజర్ మీద ఉంటాడు.. మా సామియేల్ అన్న జెండా ఊపుతాడు.. దమ్ముంటే మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
మూసీ పునరుజ్జీవ పాదయాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల లక్ష్యంగా సవాళ్లు విసిరారు. తెలంగాణ బిడ్డగా ప్రజలు తనకు అతి చిన్న వయస్సులో సీఎంగా ఛాన్స్ ఇస్తే, ప్రజలకు మేలు చేయకుండా మీ పాలన మాదిరిగా కీడు చేయాలా అంటూ సీఎం ప్రశ్నించారు.
అలాగే పదేళ్లు తెలంగాణను లూటీ చేసి, నేడు మూసీ ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తే, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. బుల్డోజర్ లకు అడ్డం పడతామని చెబుతున్నారు కొందరు.. రండి మూసీ ప్రజల మద్దతుతో మీపై ఎక్కించి, ప్రక్షాళన చేస్తానంటూ సీఎం వార్నింగ్ ఇచ్చారు.
హరీష్ రావు సవాల్ పై సీఎం స్పందిస్తూ.. హరీష్ రావు నీ సవాలు స్వీకరిస్తున్నా.. దమ్ము, ధైర్యం ఉంటే జనవరి మొదటి వారంలో నిర్వహించే పాదయాత్రలో పాల్గొనాలన్నారు. సంగెం శివయ్య సాక్షిగా నల్గొండ, రంగారెడ్డి జిల్లా ప్రజల కోసం తాను బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడితే అవినీతి ఆరోపణలు చేయడం తగదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సాక్షిగా మీ ప్రభుత్వ హయాంలో లక్ష కోట్లు దండుకొని, నేడు ప్రజా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఊరుకొనే ప్రసక్తే లేదన్నారు.
తాను డబ్బులు సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి రాలేదని, తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చే లక్ష్యంతో ప్రజా రంజక పాలన సాగిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఫ్లోరైడ్ సమస్యకు గురై మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం మీ కళ్లకు కనిపించడం లేదా.. ఎందుకంత ప్రజలపై మీకు ఆగ్రహం అంటూ కేసీఆర్, కేటీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ అన్నారు.
నల్గొండ, రంగారెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఆలోచించుకోవాలని ప్రజల పక్షాన ఉంటారో లేక మీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల పక్షాన ఉంటారో తేల్చుకోవాలన్నారు. మూసా, ఈసా నదుల అనుసంధానం వద్ద జనవరి మొదటి వారంలో పాదయాత్ర సాగిస్తానని, మూసీ పునరుజ్జీవానికి ఎవరు అడ్డుపడినా చరిత్ర హీనులవుతారన్నారు. ఇలా సీఎం పాదయాత్ర సాగగా, పెద్ద ఎత్తున ప్రజలు సీఎం అడుగుల వెంట అడుగులు వేసి తమ మద్దతు ప్రకటించారు.