CM Revanth Reddy: రాజకీయ కారణాలతోనే తన అమెరికా పర్యటనను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న రేవంత్.. సచివాలయంలోని మీడియా హాల్ లో మాట్లాడారు. కేంద్రం ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనను తిరస్కరించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏ విధమైన కారణాలతో తన పర్యటన తిరస్కరించాలో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇటీవల గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా వెళ్లేందుకు అనుమతించిన విషయాన్ని సీఎం రేవంత్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ రాష్ట్ర సీఎం భూపేంద్రభాయ్ పటేల్ కెనడా, అమెరికా వెళ్లినట్లు పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అమెరికన్ కంపెనీలను కోరారని అన్నారు. తాను కూడా పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటన షెడ్యూల్ చేసుకుంటే మాత్రం కేంద్రం అనుమతి నిరాకరించిందని మండిపడ్డారు. ఇంగ్లాండ్ కు ఏవి ఇచ్చామో అమెరికాకు కూడా అవే అనుమతి పత్రాలను సమర్పించినట్లు రేవంత్ తెలిపారు. ఇంగ్లాండ్ కు ఓకే చెప్పి.. అమెరికాకు నో ఎందుకు చెప్పారని ప్రశ్నించారు.
తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలను అవమాన పరిచే విధంగా కేంద్రం నిర్ణయం ఉందని సీఎం రేవంత్ అన్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా కాకుండా.. గుజరాత్ ప్రధానిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అటు రాష్ట్రంలోని తెలంగాణ బీజేపీ లీడర్లు.. గుజరాత్ కు కట్టుబానిసలుగా వ్యవహరిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణపై ముమ్మాటికి కేంద్రం వివక్ష చూపించిందన్న రేవంత్.. దీనిపై లోక్ సభ, రాజ్యసభలో చర్చ లేవనెత్తుతామని హెచ్చరించారు. తాను అమెరికా వెళ్తే.. గుజరాత్ కోరుకున్న పెట్టుబడులు రావన్న భయంతోనే తన పర్యటన అడ్డుకున్నారని రేవంత్ ఆరోపించారు.
తను వెళ్లినప్పుడు వచ్చే రాజకీయ కారణాలు.. గుజరాత్ సీఎం విదేశాలకు వెళ్లినప్పుడు అడ్డురావా? అంటూ రేవంత్ నిలదీశారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యహరిస్తోందని మండిపడ్డారు. తనను ఆపగలిగినా.. తన లక్ష్యాలను మాత్రం ఎవరూ ఆపలేరన్నారు. తాను అధికారులను అమెరికా పంపించానని.. గ్లోబల్ సమ్మిట్ కు వారిని ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2026 ను డిసెంబర్ 8,9 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: బ్రిటీషర్ల నాటి వైభవం.. మన దేశంలోనూ ‘లండన్’ ఉందోచ్.. విశేషాలు ఇవే!
మరోవైపు తన పర్యటనను తిరస్కరించడమే కాకుండా బీజేపీ నేతలు రాజకీయంగా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని సీఎం రేవంత్ తప్పుబట్టారు. బీజేపీ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వైఖరిపై ప్రస్తుతం మాట్లాడదలుచుకోలేదని అన్నారు. అయితే ఇది రెండు ప్రభుత్వాలకు సంబంధించిన అంశంగా రేవంత్ అభివర్ణించారు. తన అమెరికా పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సమర్పించినా.. తిరస్కరించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు గుజరాతీ నాయకత్వం చేస్తున్న కుట్రగా దీనిని పేర్కొన్నారు.
Also Read: తిరుపతిలో కలకలం.. హోంమంత్రి అనితపై పడ్డ డ్రోన్.. చేతికి గాయం!