CM Revanth Reddy: బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో మోదీ సర్కార్‌పై రేవంత్ సర్కార్ ఒత్తిడి తీవ్రతరం చేసింది. మరి మోదీ సర్కార్ ఆమోదం వేస్తుందా? లేకుంటే పెండింగ్‌లో పెడుతుందా? దీనిపై రకరకాలుగా టీవీల్లో డిబేట్లు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై నోరు విప్పారు సీఎం రేవంత్‌రెడ్డి.
ప్రధాని మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ అంశం ఉందన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రపతికి రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. మోదీ చేతుల్లో రాష్ట్రపతి ఉన్నారా అదైనా చెప్పాలన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయడానికి కేవలం పది రోజులు సరిపోతుందన్నారు.
న్యాయస్థానం తీర్పు మేరకు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ కమిట్మెంట్ నిరూపించు కుందన్నారు. మా చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించ లేరని మనసులోని మాట బయటపెట్టారు. మా పోరాటం కేంద్రంపై కాబట్టి జంతర్ మంతర్ వద్ద మాగొంతు బలంగా వినిపించామన్నారు.
గతంలో కేసీఆర్ హయాంలో ఆర్డినెన్స్ తెచ్చారని, దాన్ని సవరించిన ముసాయిదా గవర్నర్‌కి పంపామన్నారు సీఎం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నది మా కమిట్మెంట్ అని అన్నారు. రిజర్వేషన్ సాధన కోసం పూర్తిస్థాయిలో మావంతు ప్రయత్నాలు చేశామన్నారు. తొలుత కులగణన, ఆ తర్వాత రిజర్వేషన్ల సాధనలో మా చిత్త శుద్ధిని ఎవరూ శంకించ లేరని తెలిపారు.
ALSO READ: సడెన్‌గా రాజకీయ పార్టీలకు బీసీలపై ప్రేమ ఎందుకు?
రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ విషయంలో అన్ని విధాలుగా ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం కేంద్రం పరిధిలో బీసీల రిజర్వేషన్ అంశం ఉందన్నారు. కేంద్రం-బీజేపీ కోర్టులో ఈ వ్యవహారం ఉందన్నారు. బీసీలపై ప్రేమ ఉంటే వెంటనే ఆ బిల్లును కేంద్రం ఆమోదించాలన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడం కోసం, బీసీలకు న్యాయమైన వాటా కోసమే తాము కొట్లాట చేస్తున్నామని వెల్లడించారు.
జంతర్ మంతర్ వేదికగా మా వాణి బలంగా వినిపించామన్న సీఎం, దీనిపై బీజేపీ-బీఆర్‌ఎస్ నేతల విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మా కమిట్మెంట్‌కు వాళ్ల సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టడం బీఆర్ఎస్ నైజమని, తాము ఆ పని చేయలేమన్నారు.
బీసీలకు రాహుల్ ఇచ్చిన మాటను అమలు చేయడమే మా లక్ష్యమని, మోదీ చేతుల్లో బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉందన్నారు. మా ఆఖరి పోరాటాన్ని పూర్తి చేశామని, నిర్ణయం తీసుకోవాల్సిందే బీజేపీయే నని అన్నారు. కేంద్రం బిల్లుకు ఆమోదం వేయకుంటే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా వెళ్లాలో అప్పుడు ఆలోచిస్తామన్నారు. గ్రామస్థాయి నుండి ప్రజల అభీష్టం మేరకే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు.