CM Revanthreddy: కేసీఆర్ గురించి కీలక విషయాలు వెల్లడించారు సీఎం రేవంత్‌రెడ్డి. తాను సీఎం అయిన రెండో రోజు ఆయన గుండె పగిలిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అనర్ధాలకు కేసీఆర్ ప్రధాన కారణమన్నారు. రాష్ట్ర ఖజానాను లూటీ చేసింది ఆయన కాదా? అంటూ ప్రశ్నించారు.
ఇదీ ఆయన ఆక్రోశం
వరంగల్‌లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాటలపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి. మాజీ సీఎం స్పీచ్ అంతా అక్కసుతో మాట్లాడినట్టు ఉందన్నారు. కేసీఆర్ సభకు ఎన్ని బస్సులు కావాలంటే అన్ని ఇచ్చామన్నారు. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందన్నారు. బస్సులు ఆపితే సభ ఆగిపోతుందా? అని అనుకునే ఆలోచన వారికి ఉందన్నారు.
ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సభకు కనీసం బస్సులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. ఆదివారం సభలో కేసీఆర్ తన అక్కసు మొత్తాన్ని బయటపెట్టుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మీడియా మిత్రులు వేసిన కొన్ని ప్రశ్నలకు రిప్లై ఇచ్చారు.
కేసీఆర్ స్పీచ్‌లో పస లేదని తేల్చారు. కేటీఆర్, హరీష్‌లను పిల్లగాళ్లు అని కేసీఆర్ అన్నారని, వారిని ఎందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. చట్టం ప్రకారమే తాను నడుచుకుంటున్నానని, డిమాండ్లు వస్తున్నా, చట్టానికి వ్యతిరేకంగా అరెస్టులు చేయలేదన్నారు. చేసిన పనులు చెప్పుకోవడానికి కొంత వెనుకపడ్డామని, వాటిని స్పీడప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ALSO READ: స్మితా సబర్వాల్ కు రేవంత్ సర్కార్ షాక్, పోస్టింగ ఎక్కడంటే?
చరిత్ర అంటే ఇదీ?
ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేదన్నారు సీఎం. ఓక దేశాన్ని ఓడించిన చరిత్ర ఆమెకే చెల్లిందన్నారు. కేసీఆర్, మోడీ వారు అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారని వివరించారు. ఎన్నికల చివరి ఆరు నెలలు నా పాలనపై చర్చ జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని తెలిపారు. తాను ఇంకా రెండు దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఉంటానన్నారు.
ప్రజలు మాకు పదేళ్లు అవకాశం ఇస్తారన్నారు. బీఆర్ఎస్ చేసిన విధ్వంసాన్ని రెడీ చేయడానికి ఏడాది సమయం పట్టిందన్నారు. తనకు ,రాహుల్‌గాంధీ మధ్య మంచి రిలేషన్ ఉందని, దీనిపై విపక్షాలు చేస్తున్న పుకార్లను ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలో నేతలు ఓపిగ్గా ఉంటే పదవులు అవే వస్తాయన్నారు ముఖ్యమంత్రి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టపోతారని చెప్పుకొచ్చారు.
పనిలో పనిగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ వివరాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. శాంతి చర్చల అంశంపై పార్టీ హైకమాండ్‌కి సమాచారం ఇస్తామన్నారు. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలన్నారు. అధిష్టానానికి పీస్ కమిటీ రిక్వెస్ట్ పంపిస్తామని, ఆ వ్యవహారమంతా జానారెడ్డి, కేకే చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తామన్నారు.