Places Like Kashmir: కాశ్మీర్‌ను భూమిపై స్వర్గం అంటారు. కుటుంబంతో కలిసి ప్రయాణం చేయాలన్నా.. పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్ వెళ్లాలన్నా.. చాలా మందికి ముందుగా గుర్తుకువచ్చేది కాశ్మీర్ . కానీ పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి తర్వాత కాశ్మీర్‌లో పరిస్థితి దిగజారిపోయింది. ఇలాంటి సమయంలో వేసవి సెలవుల్లో చాలా కాలంగా కాశ్మీర్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్న కుటుంబాలు లేదా హనీమూన్ కోసం కాశ్మీర్ సందర్శించాలనుకునే జంటలు, కాశ్మీర్ లాంటి వివిధ ప్రదేశాలకు కూడా వెళ్లవచ్చు.
భారతదేశంలోని ప్రకృతి సౌందర్యం గురించి మాట్లాడినప్పుడల్లా.. కాశ్మీర్ పేరే మొదట వినిపిస్తుంది. మంచుతో కప్పబడిన శిఖరాలు, దట్టమైన పచ్చని పొలాలు, ప్రశాంతమైన సరస్సులు కాశ్మీర్‌ను ‘భూమిపై స్వర్గం’గా మారుస్తాయి. కానీ భారతదేశంలో కాశ్మీర్ లాంటి అందమైన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్:
ఈశాన్య భారతదేశంలో ఉన్న తవాంగ్ మంచుతో కప్పబడిన పర్వతాలు, అందమైన సరస్సులు ,బౌద్ధ ఆరామాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న తవాంగ్ మఠం ఆసియాలోనే అతిపెద్ద మఠంగా గుర్తింపు పొందింది. తవాంగ్ ప్రాంతం యొక్క సహజ సౌందర్యం ఎవరి హృదయాన్నైనా గెలుచుకోగలదు. ఒక్క సారి తవాంగ్ వెళితే మాత్రం జీవితంలో మరచి పోలేని అను భూతిని పొందుతారు.
2. స్పితి లోయ, హిమాచల్ ప్రదేశ్:
“మినీ టిబెట్” గా పిలువబడే స్పితి లోయ మంచుతో కప్ప బడి ఉంటుంది. ఇక్కడ ఎత్తైన పర్వతాలు, నీలాకాశం, ప్రశాంతమైన వాతావరణం కాశ్మీర్ లాగే ప్రత్యేకంగా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్‌లో అనేక హిల్ స్టేషన్లు కూడా ఉన్నాయి. వాటిలో స్పితి లోయ కాశ్మీర్ కు ఏమాత్రం తీసిపోదు. ఫ్యామిలీతో వెళ్లినా కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు.
3. మున్సియారి, ఉత్తరాఖండ్:
చోటా కాశ్మీర్ అని కూడా పిలువబడే మున్సియారి, మంచుతో కప్పబడిన పంచచులి శిఖరాల అద్భుతమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ట్రెక్కింగ్ ప్రియులకు ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ వివిధ ప్రాంతాల్లో ఉండే మంచు, ప్రకృతి ఇట్టే మనస్సును ఆకట్టుకుంటాయి. ట్రెక్కింగ్ చేయడానికి ఇక్కడికి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి వస్తుంటారు.
Also Read: ఈ 5 రైల్వే రూల్స్ గురించి తెలిస్తే.. మీ సమయం, డబ్బు రెండూ ఆదా ? ఎలాగంటే..
4. మేఘాలయ:
మేఘాల నిలయంగా పిలువబడే మేఘాలయ పచ్చదనం, జలపాతాలు, అద్భుతమైన గుహలకు ప్రసిద్ధి చెందింది. చిరపుంజీ, మౌసిన్రామ్ వంటి ప్రదేశాల అందాలను చూసి, మీరు కూడా ఇది కాశ్మీర్ కంటే తక్కువేమీ కాదని అంటారు. మేఘాలయాలో వాటర్ ఫాల్స్ కూడా చాలా ఫేమస్. వీటిని చూడటానికి వివిధ రాష్ట్రాల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తారు.
5. ఔలి, ఉత్తరాఖండ్:
మీరు మంచు కొండల మధ్య సాహసయాత్రను ఆస్వాదించాలనుకుంటే ఔలి సరైన ప్రదేశం. ఈ ప్రదేశం స్కీయింగ్ కు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఔలి సహజ సౌందర్యం హిమాలయ ప్రాంతాలకు పోటీగా నిలుస్తోంది. ఇక్కడి హిల్ స్టేషన్లు పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాయి.