CM Revanthreddy: బీజేపీ నేతలపై మరోసారి మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు యూనివర్సిటీకి పొట్టిశ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టడాన్ని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. దీనిపై అసెంబ్లీలో వివరణ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. తాము బీజేపీ ప్రభుత్వాల మాదిరిగా అలాంటి తప్పిదాలు చేయలేదన్నారు. ఇంతకీ బీజేపీ చేసిన తప్పేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
పేర్లు మార్పుపై సీఎం క్లారిటీ
సోమవారం అసెంబ్లీలో తెలుగు యూనివర్సిటీకి పొట్టిశ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టడంపై శాసనసభలో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గుజరాత్‌లో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద ఉన్న స్టేడియానికి నరేంద్రమోడీ స్టేడియంగా పేరు మార్చారన్నారు. తాము అలాంటి తప్పు చేయలేదని, చేయమన్నారు.
పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువ చేయడం లేదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించి అందరూ స్మరించుకోవాలన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గతంలో సూచించారు. ఆయన ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిశీలించిందన్నారు. బిల్లు రూపంలో సభ ముందుకు తీసుకొచ్చిందని గుర్తు చేశారు.
పరిపాలనలో భాగంగా కొన్ని పాలనా పరమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లు పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత పదేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కొన్ని వర్గాలకు కొందరు నేతలు అపోహాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నవారు ఇలా చేయడం సమంజసం కాదన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నామని, అంత మాత్రాన ఎన్టీఆర్‌ను అగౌరవపరిచినట్టు కాదన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు, వైఎస్ పేరుతో హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు.
అలాగే వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టినట్టు తెలిపారు. ఇందులో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్నట్లు తెలిపారు. ఏపీలో ఆ పాత పేర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలకు తెలంగాణలో పేర్లు మార్చామన్నారు.
ఒకే పేరుతో రెండు యూనివర్సిటీలుంటే పరిపాలనలో గందరగోళం తలెత్తే అవకాశం ఉందన్నారు సీఎం. అందుకే యూనివర్సిటీలకు, సంస్థలకు తెలంగాణ పేర్లు పెట్టుకుంటున్నట్లు వివరించారు. అంతే కానీ వ్యక్తులను అగౌరవపరిచేందుకు కాదన్నారు. విశాల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు కులాన్ని ఆపాదిస్తున్నారని అన్నారు.
కుల, మత ప్రాతిపదికన విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటే ముమ్మాటికీ తప్పు అని అన్నారు ముఖ్యమంత్రి. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామని, చిత్తశుద్ధి ఉంటే కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనుమతులు తీసుకురావాలన్నారు. బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్‌కు దివంగత రోశయ్య పేరు పెట్టుకుందామని, ఆయన సేవలను కీర్తించుకునేలా అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామన్నారు.
బీజేపీ నేతలేమన్నారు?
పేర్లు మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తప్పుబట్టింది. ఆంధ్రా మూలాలుంటే పేరు మార్చేస్తారా అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కులాభిమానం పేరుతో సురవరం పేరును ప్రతిపాదించారని ఆరోపించారు. ఆంధ్రా మూలాలున్న పొట్టి శ్రీరాములు పేరును తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్టీఆర్, కాసు బ్రహ్మానంద రెడ్డి, నీలం సంజీవరెడ్డి పార్కుల పేర్లను తొలగిస్తారా అంటూ ప్రశ్నించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరిట ఉన్న స్టేడియానికి ఆ పేరు తొలగించే దమ్ము ఉందా అంటూ కరీంనగర్ లో ఆదివారం ఆయన ప్రశ్నించిన విషయం తెల్సిందే.
గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద ఉన్న స్టేడియం ని నరేంద్ర మోడీ స్టేడియంగా మార్చారు
దేశ స్వాతంత్ర్యం కోసం కొట్లాడిన వల్లభాయ్ పటేల్ పేరుని తీసి మోడీ పేరు పెట్టుకున్నారు
ఇలాంటి తప్పిదాలు మేము చేయలేదు, చేయం కూడా
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి pic.twitter.com/C06DYYoipi
— BIG TV Breaking News (@bigtvtelugu) March 17, 2025