CM Revanth Reddy: పాలమూరుకు తీవ్ర అన్యాయం చేయడంలో మాజీ సీఎం కేసిఆర్ కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. దివంగత సీఎం వైఎస్సార్ చెప్పినట్లుగా తలఊపి చెప్పులు మోసి మరీ నాడు కేసీఆర్ కృష్ణా నది జలాలను తరలించేలా పాలమూరు నుండి తరలించినట్లు సీఎం సంచలన ఆరోపణలు చేశారు. అలాగే ఏపీ మాజీ సీఎం జగన్ కు వీరతిలకం దిద్ది అప్పనంగా రాయలసీమకు జలాలు అందించిన ఘనత కూడా నీదే కేసీఆర్.. మాపై ఎందుకింత కక్ష అంటూ సీఎం కాస్త భావోద్వేగానికి గురయ్యారు.
నారాయణపేట్ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. వైఎస్సార్, వైఎస్ జగన్ పేర్లను ఉచ్చరించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరికీ కేసీఆర్ వంతపాడి నేడు పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని సీఎం విమర్శించారు. సీఎం మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎంతో కృషి చేసి కొండంగల్ కు నీటి ప్రాజెక్ట్ తెచ్చినట్లు సీఎం అన్నారు. దేశంలో ఎక్కడ ఏ ప్రాజెక్ట్ నిర్మించినా, అక్కడ పాలమూరు బిడ్డల కష్టం ఉందన్నారు. వలసలు వెళ్లడం, పిల్లలను ఇంటి పెద్దలైన వృద్ధుల వద్ద వదలడం.. ఇదే పాలమూరు బిడ్డల జీవితచక్రంగా మారిందన్నారు.
దివంగత సీఎం వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ పూర్తికి ఎంపీగా ఉన్న కేసీఆర్ నాడు సహకరించి అన్యాయం చేశారన్నారు. వైయస్సార్ చెప్పులు మోసి మరీ కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించిన పాపం నీది కాదా కేసీఆర్ అంటూ సీఎం ప్రశ్నించారు. హారతులు ఇచ్చి మరీ నాడు జలాలు తరలిపోతుంటే, కేసీఆర్ సైలెంట్ గా ఉన్నట్లు సీఎం అన్నారు. ఆనాడు ఊడిగం చేసి నేడు రాగాలు పలుకుతున్న కేసీఆర్.. తన మాటకు సమాధానం ఇచ్చే దమ్ముందా అంటూ ప్రశ్నించారు.
అనంతరం ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రగతి భవన్ కు పిలిపించి మరీ, మన ఆరు గంటలు మాట్లాడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది కూడా కేసీఆర్ అంటూ సీఎం ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు, ప్రధానంగా పాలమూరు వాసులకు ద్రోహం చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని, పాలమూరు బిడ్డలంటే ఎందుకు అంత కక్ష అంటూ సీఎం ప్రశ్నించారు. జగన్ సీఎం కాగానే రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో ప్రవహించాల్సిన కృష్ణా జలాలు.. రాయలసీమ జిల్లాలకు తరలిపోతుంటే జగన్ కు వీర తిలకం దిద్ది మరీ నాడు కేసీఆర్ మద్దతు పలికారన్నారు.
Also Read: CM Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీకి సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే?
పదేళ్లు అధికారంలో బీఆర్ఎస్ ఉండగా, ఐదేళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు, మరో ఐదేళ్లు కేసీఆర్ ఉన్నారన్నారు. వారిద్దరి నిర్వాకంతోనే నేడు పాలమూరు ప్రజలకు కష్టాలు మిగిలాయన్నారు. పాలమూరు ప్రజల కష్టాలను తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని, పాలమూరు ప్రజలందరికీ సీఎం తన వంతు భరోసానిచ్చారు. పదేళ్లలో రెండు లక్షల కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు నిర్మించినట్లు గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. నీళ్లను రాయలసీమకు పంపించి నిధులను తన ఇంటికి పంపించి, పదవులు తన కుటుంబ సభ్యులకి అందించి రాష్ట్రాన్ని నాశనం చేసినట్లు విమర్శించారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం కేసిఆర్ కు ఉందా అంటూ సీఎం సవాల్ విసిరారు. మొత్తం మీద నారాయణపేట్ పర్యటనలో ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారని చెప్పవచ్చు. మరి సీఎం చేసిన కామెంట్స్ కి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.