CM Revanth Reddy Promised Nizam Sugar Factory will Be Re-opened Before September 17th: సెప్టెంబర్ 17వ తేదీ లోపు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ ప్రజలకు హామీ ఇచ్చారు. నిజామాబాద్ ప్రజలను బీజేపీ మోసం చేసిందంటూ విమర్శించారు. ఎన్నికల కోడ్ పూర్తి అవ్వగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి.. ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా వాసులకు కీలక హామీ ఇచ్చారు. నిజాం చక్కెర పరిశ్రమను సెప్టెంబర్ 17లోపు పునరుద్ధరిస్తామిని స్పష్టం చేశారు. పసుపుబోర్టును ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలను దారుణంగా మోసం చేశారంటూ మండిపడ్డారు. అయితే పసుపు బోర్టును ఎక్కడ ఏర్పాటు చేస్తామనే విషయాన్ని ఆ బాండ్ లో స్పష్టంగా వెల్లడించలేదన్నారు. ఎన్నికల అయిన తర్వాత దాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఎవ్వరికీ తెలియదన్నారు.
నిజామాబాద్ అంటే తనికి ప్రత్యేక అభిమానం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అక్కడి ప్రజలకు వెల్లడించారు. అందుకనే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీని పునరుద్ధరణ కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఆమె నిజామాబాద్ రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు.
Also Read: CM Revanth Reddy: మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలే..
కేంద్రంలో కాంగ్రెస్ కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. షుగర్ ఫ్యాక్టరీ, పసుపు బోర్టులను ఎలా అయినా సరే.. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సాధించి తీరుతారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. దేవుడిని, భక్తిని ఓటర్లుగా మార్చి మోదీ ఆటలాడుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాలన్నారు.