తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. వయనాడ్ లో ప్రియాంక గాంధీ తరపున ఆయన ప్రచారం చేయనున్నారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు సైతం వెలుతుండగా వీరిద్దరూ రేపు నిర్వహించబోయే ర్యాలీలో పాల్గొని ప్రియాంక గాంధీ తరుపున ప్రచారం చేయబోతున్నట్టు సమాచారం. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు చెందిన పలువురు మంత్రులను, సీఎంను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే మంత్రి భట్టి విక్రమార్క జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు ప్రియాంక గాంధీ వయనాడ్ లో నామినేషన్ వేసిన సందర్భంగా సీఎం రేవంత్ తో పాటు పలువురు కీలక నేతలు అక్కడకు వెళ్లి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ వయనాడ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళుతున్నారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలి స్థానాల్లో గెలిచిన తరవాత రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఇప్పుడు అదే స్థానం నుండి ప్రియాంక బరిలో దిగుతుండటంతో అక్కడ కచ్చితంగా గెలిచి తీరాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో బరిలో దిగడం ఇదే మొదటిసారి కావడంతో ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
వయనాడ్ స్థానం నుండి రాహుల్ గాంధీ రెండు సార్లు విజయం సాధించారు. ఆయన 2019లో కాంగ్రెస్ కంచుకోట అమేథీ, వయనాడ్ స్థానాల నుండి పోటీ చేయగా అమేథీలో ఓడినప్పటికీ వయనాడ్ లో విజయం సాధించారు. దీంతో ఆ స్థానం అంటే రాహుల్ గాంధీకి వయనాడ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువగా మొగ్గుచూపుతారు. అయితే రాబోయే ఉపఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ ను ఓడించాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే బీజేపీ వయానాడ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఆ పార్టీ నుండి నవ్య హరిదాస్ అనే మహిళను బరిలో దింపుతోంది. అంతే కాకుండా ప్రియాంక స్థానికేతరులు అంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తుండటంతో ఆ పార్టీపై విమర్శలు వస్తున్నాయి. ఇక కేరళ తమకు కంచుకోట కావడంతో ఎల్ డీఎఫ్ నేతలు సైతం వయనాడ్ పై కన్నేశారు. దీంతో త్రిముఖ పోరు కావడంతో ఎన్నికల ప్రచారం కూడా జోరుగా ఉండబోతుందని స్పష్టంగా కనిపిస్తోంది.