జమిలి ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీ లిమిటేషన్ జరగబోతోందని, సీట్లు పెరగబోతున్నాయని, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయని, ఆడబిడ్డలకు అవకాశాలు పెరగబోతున్నాయని, జమిలి ఎన్నికలు కూడా వస్తాయని చెబుతున్నారని.. ఆ సమయానికి అందరూ రెడీగా ఉండాలని అన్నారు రేవంత్ రెడ్డి. “సమయం వచ్చినప్పుడు మీరు రెడీగా లేకపోతే, డ్రైక్లీనింగ్ లో ఉన్న ఇస్త్రీ బట్టలు తీసుకోడానికి అటే పోతే బీఫామ్ దగ్గరకు రాదు, మీరు ప్రజల దగ్గర ఉండండి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి, తప్పకుండా పార్టీ, ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది.” అని అన్నారు రేవంత్ రెడ్డి. పీఏసీ సమావేశంలో పల్గొన్న ఆయన కాంగ్రెస్ నేతలకు కీలక సూచనలు చేశారు.
జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఏ సమయమైనా పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలంటూ రేవంత్ సూచనలు pic.twitter.com/UPqBkGIkkP
— BIG TV Breaking News (@bigtvtelugu) June 24, 2025
పదేళ్లు అధికారం మనదే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి, అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో ఇంకోసారి ధర్నాలు చేయొద్దని హితవు పలికారు. సమస్యలు ఉంటే తమ వద్దకు తీసుకురావాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి. నామినేటెడ్ పోస్ట్ ల భర్తీలో నాయకుల పనితీరే గీటురాయి అని చెప్పారు రేవంత్ రెడ్డి. గతంలో తాను టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్ బాధ్యతలు తీసుకోమని కొందర్ని కోరితే, వారు వెనకడుగు వేశారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. సీనియర్లు, అంత చిన్న చిన్న బాధ్యతలు తీసుకోరంటూ వెనకడుగు వేశారని, కానీ ఆ రోజు బాధ్యత తీసుకున్న వారికి పార్టీ అధికారంలోకి రాగానే కార్పొరేషన్ పదవులు వచ్చాయని చెప్పారు. పార్టీ నిర్మాణంలో భాగస్వాములు అయితే పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పారు రేవంత్ రెడ్డి.
తెలంగాణలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని, అయితే పార్టీ నేతల పనితీరుపైనే అది ఆధారపడి ఉందని చెప్పారు రేవంత్ రెడ్డి. పదేళ్లు కాంగ్రెస్ గ్యారెంటీగా అధికారంలో ఉంటుందన్నారు. గతంలో టీడీపీ, ఆతర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ఎస్ రెండు దఫాలు అధికారంలో ఉన్నాయని, అదే ఆనవాయితీతో కాంగ్రెస్ కూడా రెండు దఫాలు గ్యారెంటీగా అధికారంలో ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా కష్టపడి పనిచేయాలని సూచించారు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అని అభివర్ణించారు సీఎం రేవంత్. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థ వంతంగా తీసుకెళ్లగలుగుతామని చెప్పారు.
పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు క్షేత్ర స్థాయికి వెళ్లాల్సిందేనని, ప్రజలతో మమేకమై పనిచేయాల్సిందేనని చెప్పారు రేవంత్ రెడ్డి. అలా పని చేస్తేనే నామినేటెడ్ పదవులు వరిస్తాయన్నారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారికి, పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. మార్కెట్ కమిటీలు, ఆలయాల కమిటీల వంటి నామినేటేడ్ పోస్టులు భర్తీ చేసుకోవాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారాయన. రాబోయే రోజుల్లో చాలా సవాళ్లు ఎదుర్కోబోతున్నామని గుర్తు చేస్తూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని చెప్పారు రేవంత్ రెడ్డి.