కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన అనంతరం ఆయన సాంకేతిక సంస్థలు, ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ తీరును ఎండగడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ కొత్త డిజైన్లకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే రాష్ట్రానికి మేలు జరిగేదని, కానీ కమీషన్ల కోసం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను కట్టారని ఆరోపించారు.
కాళేశ్వరాన్ని ఒక అద్భుతమైన కట్టడంగా ప్రపంచానికి చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. 2016లో పనులు మొదలుపెట్టి 2019 నాటికి హడావుడిగా పూర్తి చేసి కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. 2020 నుండే బ్యారేజీలలో లీకులు ఉన్నట్లు ఇంజనీర్లు నిర్మాణ సంస్థలకు లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. వాస్తవాలను దాచిపెట్టి ప్రజల కళ్లు కప్పే ప్రయత్నం చేశారని, కేసీఆర్ చేసిన పాపాన్ని ప్రకృతి బయటపెట్టిందని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీ కూలిన తర్వాత ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ప్రాజెక్టు వైఫల్యాన్ని స్పష్టం చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నీళ్లు నిల్వ చేసేందుకు ఏమాత్రం పనికిరాదని నివేదికలు తేల్చాయని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి మరోసారి లేఖ రాసినట్లు వెల్లడించారు. ఒకవేళ కేంద్రం విచారణకు ఆదేశించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీబీఐ విచారణ ఎక్కడ మొదలవుతుందోనన్న భయంతోనే హరీష్ రావు రహస్యంగా ఢిల్లీ వెళ్లారని ఎద్దేవా చేశారు. బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకొని విచారణను అడ్డుకోవడమే హరీష్ రావు పర్యటన ఉద్దేశమని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ స్వప్రయోజనాలే ముఖ్యం అన్నట్లుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
ALSO READ: కేసీఆర్ పర్యటనలో డ్రోన్ కలకలం.. భద్రతా లోపమా? ప్రైవేటు వ్యక్తుల పనా?