Growth Corridor: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాలు ,పట్టణాలను ఆర్థిక హబ్‌లుగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘మెగా గ్రోత్ కారిడార్’ ప్రణాళికపై మంగళవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అత్యాధునిక సాంకేతికతతో కూడిన అర్బన్ సెంట్రిక్ డెవలప్‌మెంట్‌కు ఆయన శ్రీకారం చుట్టారు.
అధికారులకు సీఎం ఆదేశాలు
ఇందులో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేగాక రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని రోడ్ల నిర్మాణం జరగాలన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టును డిఫెన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్ భవిష్యత్ తెలంగాణకు వెన్నెముకగా నిలుస్తుందని, ఎయిర్‌పోర్టుల రాకతో ఈ ప్రాంతాల రూపురేఖలు మారతాయని సీఎం పేర్కొన్నారు.
నగరాభివృద్ధిపై సీఎం ఫోకస్
ఇక ఖర్చు తగ్గించడానికి, కాలుష్య నియంత్రణకు మున్సిపాలిటీల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలన్నారు. లీజుకు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే అయి ఉండాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని సూచించారు. అన్ని నగరాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలన్నారు.ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించారు. రేడియేషన్ ప్రభావం తగ్గించడానికి నగరాల్లో మల్టీ యుటిలిటీ టవర్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి
మున్సిపాలిటీల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు తప్పనిసరి అన్నారు. సీవరేజ్ బోర్డు శుద్ధి చేసిన నీటిని మాత్రమే భవన నిర్మాణాల్లో వాడేలా నిబంధనలు తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. నల్గొండ – యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, అలాగే ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ పర్యావరణ పర్యాటక కారిడార్‌ను అభివృద్ధి చేయాలన్నారు. సింగరేణి పరిధిలోని మున్సిపాలిటీలను ఒకే యూనిట్‌గా పరిగణించి, సింగరేణి సీ ఎస్ ఆర్ నిధులను స్థానిక అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని ఆదేశించారు. రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అలంపూర్ జోగులాంబ ఆలయ పరిసరాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
25 ఏళ్ల విజన్‌తో తెలంగాణ అభివృద్ధి
‘వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి డిజైన్ ఉండాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తాం.’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమీక్షా సమావేశంలో నొక్కి చెప్పారు.. ఈ కార్యక్రమంలో సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు గాయాలు!