CM Revanth Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కులగణన, బీసీ వర్గీకరణ గురించి రాహుల్ గాంధీతో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే కేబినెట్ విస్తరణపై రాహుల్ తో మాట్లాడినట్లు సమాచారం.
నిన్న తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని ఏఐసీసీ మార్చిన విషయం తెలిసిందే. అయితే నూతన ఇంఛార్జ్ నియామకం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే.. ప్రస్తుతం ఖాళీ కానున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా అభ్యర్థుల ఎంపికై కూడా రాహుల్ గాంధీతో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. త్వరలో సూర్యాపేట, గద్వాల్ జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కుల గణన సర్వే పూర్తి అయిన సందర్బంగా సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వీలును బట్టి సభ ఏ తేదీన నిర్వహించాలో త్వరలోనే నిర్ణయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన్ ఖర్గేతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ కుల వర్గకరణ అమలు పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో రాబోయే రెండు నెలల్లో జోగులాంబ గద్వాల జిల్లా లేదా మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ సభకు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ను ఆహ్వానించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ రెండు బహిరంగ సభల ద్వారా పంచాయతీ ఎన్నికలలో సత్తా చాటాలనే నేపథ్యంలో తమ నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.