CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుగా ఉన్న మూసీ పునరుజ్జీవన పనులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2024లోనే సీఎం రేవంత్ ప్రకటన చేశారు. తర్వాత నది తీర ప్రాజెక్టుల అధ్యయనానికి రేవంత్ బృందం యూకే, దక్షిణ కొరియాలో పర్యటించింది. ఆక్రమణల తొలగింపుపై వ్యతిరేకత నడుమ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ఏడీబీ 4,100 కోట్ల రుణాన్ని ప్రకటించింది. మరోవైపు ప్రధాన భాగాలకు సంబంధించి మూడు డీపీఆర్‌లు ఫైనల్ స్టేజీలో ఉన్నాయి.
హైదరాబాద్ వాసుల నీటి కష్టాలకు చెక్.. గోదావరి ఫేజ్ 2, 3 పనులకు శ్రీకారం..
త్వరలో హైదరాబాద్ వాసుల తాగునీరు కష్టాలు తీరనున్నాయి. 2030 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని, రానున్న ఐదేళ్లు పాటు తాగు నీటికి ఎలాంటి డోకా లేకుండా ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నగరానికి 20 టీఎంసీల అదనపు నీటిని తరలించడానికి, మూసీ పునరుజ్జీవం కోసం జంట జలాశయాలను గోదావరి నీటితో నింపనున్నారు. దీనికోసం 7,360 కోట్ల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టుకు నేడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
అదనంగా 20 టీఎంసీల జలాల తరలింపు.. 2030 వరకు నీటి అవసరాలకు డోకా లేనట్టే..
ప్రస్తుతం గ్రేటర్ తాగునీటి అవసరాలకు అన్నిరకాల వనరుల నుంచి 580 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నారు. 2030 వరకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని 300 ఎంజీడీల అదనపు జలాలను సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండడంతో, అదనపు జలాల కోసం ఫేజ్ 2, 3 ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. 2027 వరకు హైదరాబాద్ నగర తాగు నీటి డిమాండ్ 835 ఎంజీడీలకు పెరిగే అవకాశముందిఇ. 2047 నాటికి ఈ సంఖ్య 1,114 ఎంజీడీలకు వరకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం గోదావరి ఫేజ్ 2, 3 ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు సిద్ధమైంది.
నేడు గండిపేట దగ్గర శంకుస్థాపన చేయనున్న సీఎం
ఫేజ్ 1 కింద నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీరు తరలిస్తుండగా, తాజాగా పథకంలో రెండు దశల ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 20 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. ఈ 20 టీఎంసీల్లో 17.5 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 2.5 టీఎంసీలను ఉపయోగించనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వల్ల రెండు లాభాలున్నట్లు వివరించారు. ఒకటి హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడంతో పాటు మూసీ ప్రక్షాళన, జంట జలాశయాల పునరుజ్జీవనం చేసే అవకాశ ముంటుందని వెల్లడించారు.