CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల అమలులో మరో ముందడుగు వేసింది. కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకంగా అంధ విద్యార్థులకు.. సంగీత వాయిద్య పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, సంగీతంపై ఆసక్తి ఉన్న అంధ విద్యార్థులకు ప్రభుత్వం తగిన శిక్షణ, అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉత్సాహపరిచారు.
విద్యార్థుల ప్రతిభకు సీఎం ఫిదా
సంగీత పరికరాలను అందుకున్న విద్యార్థులు.. ప్రత్యక్ష వేదికపైనే పాటలు పాడి వినిపించారు. వారి స్వరాలు వినిపించినప్పుడు సభలో ఉన్న వారందరూ కరతాళధ్వనులతో అభినందించారు. ముఖ్యమంత్రి విద్యార్థుల గాత్ర నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ, శారీరక సమస్యలు ఉన్నప్పటికీ ప్రతిభతో ముందుకు రావచ్చని రుజువు చేస్తున్నారని అన్నారు.
విద్యార్థులు పాడిన పాటలను ప్రత్యేకంగా సీడీ రూపంలో తయారు చేసి, ఆ సీడీని ముఖ్యమంత్రి, మంత్రులు ఆవిష్కరించారు.
మంత్రుల సందేశం
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. సంగీతం ఒక సాధన, అది కేవలం వినోదం మాత్రమే కాకుండా మనసుకు, ఆత్మకు శాంతి ఇచ్చే శక్తి కలిగివుంటుందని అన్నారు. అంధ విద్యార్థులు ఈ రంగంలో సాధన చేస్తే భవిష్యత్తులో గొప్ప గాయకులు, సంగీతకారులు కావచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రజా ప్రతినిధులు హాజరు
ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు. అందరూ కలసి అంధ విద్యార్థులకు ఉత్సాహం కల్పిస్తూ, భవిష్యత్తులో పెద్ద వేదికలపై వారు ప్రదర్శనలు ఇవ్వాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వం కట్టుబాటు
ముఖ్యమంత్రి మాట్లాడుతూ .. విద్య, కళలు, ఉపాధి రంగాలలో ప్రతిఒక్కరికీ అవకాశాలు కల్పిస్తాం. అంధ విద్యార్థులు కూడా ప్రతిభ చూపేందుకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన సూచనల మేరకు, అంధ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు, స్కాలర్‌షిప్‌లు, వేదికలు కల్పించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: తెలంగాణ ప్రభుత్వంపై కుట్ర.. తెర వెనుక ఉన్నది ఎవరంటే..!
కరీంనగర్‌లో జరిగిన ఈ కార్యక్రమం అంధ విద్యార్థులకు కొత్త ఆశలు నింపింది. సంగీత వాయిద్యాలను అందించిన ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, మరింత కష్టపడి రాణించాలని విద్యార్థులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇచ్చిన హామీలు అమలు అయితే, భవిష్యత్తులో తెలంగాణ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంధ గాయకులు, సంగీతకారులు వెలువడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.