తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారాలపై సీబీసీఐడీ (CB- CID) విచారణకు ఆయన ఆదేశించారు. 2014 జూన్ 2 నుంచి జరిగిన అన్ని అక్రమాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేశారు. విచారణ నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే సభ ముందు ఉంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇసుక అలాగే గ్రానైట్ దోపిడీని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. సిరిసిల్ల కేంద్రంగా సాగిన ఇసుక మాఫియాపై సంతోష్ రావు ఆయన తండ్రి రవీందర్ రావు పాత్రపై విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గంగుల కమలాకర్‌కు సంబంధించి ఇల్లీగల్ గ్రానైట్ మైనింగ్ అంశాలను కూడా దర్యాప్తు పరిధిలోకి తెచ్చారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కంపెనీ నిర్వహించిన మైనింగ్ కార్యకలాపాలతో పాటు రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ అక్రమాలపై నిగ్గు తేలుస్తామని వెల్లడించారు. నెరేళ్ల అక్రమ ఇసుక రవాణా అలాగే 169 జీవో ద్వారా ఏపీ మాజీ ఎమ్మెల్యేను బెదిరించిన ఘటనలపైనా లోతైన విచారణ జరిపిస్తామన్నారు.
హరీష్ రావు సోదరుడి పేరుతో సాగిన అక్రమ గ్రానైట్ దోపిడీతో పాటు శ్వేత గ్రానైట్ అలాగే గాయత్రి గ్రానైట్ సంస్థల వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సంస్థల అక్రమ మైనింగ్‌ను ఈడీ (ED), విజిలెన్స్ విభాగాలు ఇప్పటికే గుర్తించాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ఖజానాకు గండి కొట్టే ఏ చిన్న తప్పిదాన్నైనా ప్రభుత్వం ఉపేక్షించబోదని ఆయన హెచ్చరించారు. రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థకు తమ ప్రభుత్వమే నోటీసులు ఇచ్చి మైనింగ్ శాఖ ద్వారా జరిమానా వసూలు చేసిందని వివరించారు. అధికారులు నిజాయితీగా పనిచేస్తున్నారు కాబట్టే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను వెలికితీస్తున్నారని కొనియాడారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న సిఫారసులను అలాగే పైరవీలను మంత్రి ప్రోత్సహించడం లేదనే కక్షతోనే ఆయనపై బురద జల్లుతున్నారని విమర్శించారు. మంత్రికి అక్రమాలతో సంబంధం ఉంటే అధికారులు నోటీసులు ఇచ్చేవారు కాదని ఆయన తర్కాన్ని లేవనెత్తారు. కేవలం బ్లాక్ మెయిల్ రాజకీయాల కోసమే విపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడే క్రమంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ దోషులు ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
ALSO READ: Harish Rao: అసత్య ఆరోపణలు చేస్తే.. నన్ను వెంటనే ఉరితీయండి, అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం