CM Revanth Reddy: గురుకుల పాఠశాలలకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించినా, వరుసగా ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు చోటు చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరయ్యారు.
సమావేశం ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రభుత్వం తరఫున డైట్ చార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచినా వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడంపై సీఎం రేవంత్ రెడ్డి, అధికారులను ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరగడం ద్వార, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ లు తనిఖీలకు వెళ్లాలని, అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని సీఎం సూచించారు. ఇప్పటినుండి ప్రతివారం ప్రభుత్వ పాఠశాలలను, రెసిడెన్షియల్ పాఠశాలలను జిల్లా కలెక్టర్లు తప్పక తనిఖీ చేసి రిపోర్ట్ సీఎంవో కార్యాలయానికి అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Also Read: CM Revanth Reddy: ఆదివాసీలకు అండగా ఉంటాం.. అభివృద్ది వైపు నడిపిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి
అనంతరం జనవరి 26న రిపబ్లిక్ డే నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఈ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని, అన్ని గ్రామాల్లో గ్రామ సభల నిర్వహణ, మున్సిపాలిటీలో వార్డు సభలు నిర్వహించేందుకు వెంటనే సన్నాహాలు చేసుకోవాలని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ల పై ఉందని, ఈ విషయాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు గుర్తుంచుకోవాలని సీఎం తెలిపారు.