CM Revanth Reddy: హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహాసభలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని మహాసభ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అలాగే వేదిక మీద గల ప్రముఖ నటుడు సాయికుమార్ ను రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు నాడు ఐటీ రంగాన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చారన్నారు. హైదరాబాద్ నగరం ఆర్థికంగా బలోపేతం కావడంలో ఐటీ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. మొదటి స్థానంలో హిందీ ఉంటే, రెండవ స్థానంలో తెలుగు భాష దేశంలో గుర్తింపు పొందిందన్నారు. దేశంలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్యలో తెలుగు రెండవ స్థానంలో ఉందని సీఎం అన్నారు.
మన తెలుగు భాష ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పేగా మహాసభను నిర్వహించడం ఆనందించదగ్గ విషయమన్నారు. తెలుగు సినిమా రంగం నేడు అత్యధిక ప్రజాదరణ పొందుతూ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందడం మనకు గర్వకారణమన్నారు. మాతృభాషలో మనం మాట్లాడడం ద్వార, తెలుగు భాష ఔన్నత్యాన్ని మరింతగా పెంచినట్లుగా ఉంటుందని సీఎం అన్నారు. మహారాష్ట్రలో ఎందరో తెలుగువారు స్థిరపడిపోయారని, అక్కడి ఎన్నికల ప్రచారం కోసం తాను వెళ్లడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం తెలిపారు.
Also Read: Nalgonda News: మాటలు కలిపి, అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆ యువతి ఏం చేసిందంటే?
హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చేందుకు అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు ఎయిర్ పోర్ట్ లు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే హైదరాబాద్ నగరంలో ఫ్యూచర్ సిటీని 30000 ఎకరాలలో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, మహాసభలో సీఎం అన్నారు. తెలుగు వారందరూ ఎక్కడున్నా, ప్రపంచంతో పోటీ పడడం అలవాటుగా అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని, అప్పుడే తెలుగువారి ఖ్యాతి చాటి చెప్పినట్లవుతుందన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి ఉత్తర్వులను తెలుగులో అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాష ప్రాముఖ్యతపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులు సైతం ఏర్పాటు చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారు.