CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా తన బ్రాండ్ అన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేయబోతున్నారు. మహిళలను కోటీశ్వరులను చేసే పనిలో ఉన్నారు. రుణమాఫీ, బోనస్ ధరలతో రైతు నేస్తంగా నిలిచారు. రోజుకు 18 గంటలు పని చేస్తూ.. పాలనలో దూసుకుపోతున్నారు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పుల గాయాలను ఓర్చుకుంటూ.. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ నగరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. భాగ్య నగరాన్ని బంగారు తునకగా మార్చేందుకు నిత్యం శ్రమిస్తున్నారు.
ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్..
మెట్రో రైల్ విస్తరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను పొడిగించాలని నిర్ణయించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవెలప్‌మెంట్ యూనివర్సిటీ వరకు.. మొత్తం 40 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్ట్ విస్తరించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుందని.. ఆ ప్రాంతానికి మెట్రో సర్వీసులు ఉండాల్సిందేనని సీఎం చెప్పారు. అందుకు తగ్గట్టు డీపీఆర్ రెడీ చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. ఈ ప్రాజెక్టులో HMDAను కూడా భాగస్వామ్యులను చేయాలన్నారు. ఎల్ బీ నగర్ నుంచి ఎయిర్ పోర్ట్ మెట్రోను కలుపుతూ.. ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ చేస్తారు. ఈ కారిడార్‌లో 9 స్టేషన్లు వస్తాయి. అయితే, ఏయే ప్రాంతాలు అనేది ఇంకా కన్ఫార్మ్ చెయ్యాల్సి ఉంది. అలానే, ఇప్పటికే ప్రతిపాదించిన మెట్రో రెండో దశ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్లు రావాల్సి ఉందని అధికారులు సీఎంకు తెలిపారు.
Also Read : తెలంగాణ డిజిటల్ మయం.. మరో 6 నెలల్లో..
ORR to RRR…
మౌలిక వసతులు బాగుంటేనే ఏ నగరమైనా బాగుండేది. ఇప్పటికే హైదరాబాద్ సిటీ కిక్కిరిసిపోయింది. శివార్ల వరకూ విస్తరించాల్సిన టైమ్ వచ్చింది. అందుకే, రీజినల్ రింగ్ రోడ్ – RRR ప్రాజెక్ట్ చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా ఆ పనులపై సమీక్ష నిర్వహించారు. డీపీఆర్, భూసేకరణ పనులు వెంటనే పూర్తి చేయాలని.. రైతులతో జిల్లా కలెక్టర్లు మాట్లాడాలని ఆదేశించారు. ORR నుంచి RRR వరకు రేడియల్ రోడ్లు నిర్మించాలని అన్నారు. ఎగుమతుల కోసం డ్రైపోర్టుకూ ప్రణాళికలు రెడీ చేయాలని సూచించారు. హైదరాబాద్-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ రహదారి.. హైదరాబాద్-రాయ్‌పూర్ జాతీయ రహదారి.. హైదరాబాద్-మంచిర్యాల నేషనల్ హైవేకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు సీఎం.