Revanth Reddy Singapore Visit : గత ఏడాది సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యాటనలో వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిన నేపథ్యంలో.. ఈసారి గతం కంటే మరిన్ని నిధుల్ని సాధించాలనే లక్ష్యంగా సింగపూర్, దావోస్ లలో పర్యటిస్తున్నారు. సీఎం పర్యాటన మొదటిరోజే మంచి స్పందన కనిపిస్తోంది. పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ టీమ్ శుక్రవారం సింగపూర్ లో పర్యటించింది. ఇందులో భాగంగా.. సింగపూర్ లోని సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ – ఐటీఈ క్యాంపస్ ను సందర్శించింది.
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని తలపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీకి మరిన్ని వనరుల్ని, సదుపాయాల్ని అందించాలని బలంగా భావిస్తున్న రేవంత్.. తొలి అడుగు అక్కడి నుంచే ప్రారంభించారు. తన కలల ప్రాజెక్టును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు.. అక్కడి ఆధునిక నైపుణ్య శిక్షణ, వసతులు, నైపుణ్యాల అభివృద్ధిపై పరిశోధన వంటి అంశాలను గమనించింది. ఐటీఈ లో పర్యటించిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అక్కడ శిక్షణను అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చలు జరిపిన సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ – ఐటీఈ ఉన్నతాధికారులు.. రాష్ట్రానికి రావడానికి ఆసక్తి కనబర్చారు. హైదరాబాదులో సర్వ హంగులతో, సకల సదుపాయాలతో నిర్మించనున్న ఫోర్త్ సిటీలో రేవంత్ రెడ్డి కలల యూనివర్శిటీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీ గురించి.. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు వివరించారు. ఈ యూనివర్శిటీ అందించే కోర్సులు, వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేలా.. మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా నైపుణ్యాల శిక్షణకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
నైపుణ్యాల అభివృద్ధి – (స్కిల్ డెవెలప్మెంట్) శిక్షణలో భాగస్వామ్యం కోసం పరస్పర సహకారం అందించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తితో ఐటీఈ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పని చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. భారత్ లోని భారీ ఎత్తున ఉన్న యువతరానికి నైపుణ్యాల్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ రైజింగ్, సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చర్చల తర్వాత నైపుణ్యాల అభివృద్ధిలో కలిసి పని చేసేందుకు ఐటీఈ, స్కిల్ యూనివర్శిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో.. సీఎం రేవంత్ రెడ్డి ఈ యూనివర్శిటీని అన్ని వసతులతో తీర్చిదిద్దాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో.. అంతర్జాతీయంగా ఉత్తమంగా ఉన్న వనరుల్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఒప్పందంపై యూనివర్సిటీ వీసీ సుబ్బారావు, సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం తరఫున అకడమిక్ అండ్ అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వేందర్ సింగ్, ఐటీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ సంతకాలు చేశారు. త్వరలోనే ఐటీఈ ప్రతినిధి బృందం హైదరాబాద్ ను సందర్శించనుంది. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్ వీ ఎస్ఎస్ సుబ్బారావు ఉన్నారు.
సింగపూర్ విదేశాంగ మంత్రితో సీఎం భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం శుక్రవారం ఉదయాన్నే సింగపూర్ కు చేరుకుంది. తొలి రోజు పర్యటనలో భాగంగా సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో విస్తృత చర్చలు జరిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నదుల పునరుజ్జీవనం, నీటి వనరుల నిర్వహణ, హరిత ఇంధనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ పార్కుల అభివృద్ధి అంశాలపై చర్చలు జరిపారు. విస్తృత సహకారంతో పాటు పలు అంశాల్లో దీర్ఘకాలిక భాగస్వామ్యాలపై ముఖ్యమంత్రి ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. మూడు రోజుల సింగపూర్ పర్యటన అనంతరం స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి బృందం పాల్గొంటుంది.
Also Read :
విమానాశ్రయంలో ప్రవాసుల సందడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రెండు దేశాల పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ప్రతినిధి బృందానికి సింగపూర్లో ప్రవాసులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వస్తున్నారనే సమాచారంతో సింగపూర్ విమానాశ్రయంలో తెలంగాణ ప్రవాసుల సందడి నెలకొంది. వారందరూ ముఖ్యమంత్రి బృందానికి స్వాగతం పలికారు. పర్యటన విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియజేశారు.