Vizag Steel Plant: ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లుగానే చేశారు. కేంద్రాన్ని ఆ విషయంలో ఒప్పించారు. పీఎం మోడీ పర్యటన తర్వాత ఏ మాటకోసం కూటమి ప్రభుత్వం వెయిటింగ్లో ఉందో ఆ చల్లని కబురు చెప్పకనే చెప్పింది కేంద్రం. ఏకంగా రూ. 11500 కోట్ల రూపాయలు అందించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. దీనితో ఏపీ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పవచ్చు. ఇంతకు ఏ విషయంలో ఆ నిధులు విడుదలయ్యాయో తెలుసా.. అదేనండీ అసలు ఉంటుందా.. ఉండదా అనుకుంటూ కాలం వెళ్లదీస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది.
ఇటీవల పీఎం మోడీ విశాఖలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సంధర్భంగా రూ. 2 లక్షల కోట్ల నిధులతో అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేయడంతో పాటు, పలు పనులను ప్రారంభించారు. అయితే ఇక్కడే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఒక ప్రధాన సమస్యను మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక ప్రోత్సాహం అందించాలని కోరారు. అప్పుడు పూర్తి విషయం తెలుసుకున్న మోడీజీ, పర్యటన విజయవంతం కావడంతో ఆనందం వ్యక్తం చేశారు.
పీఎం పర్యటన ముగిసింది. ఇంకా ఏ ప్రకటన రాలేదని ప్రభుత్వం ఎదురుచూపుల్లో ఉంది. ఆ ఎదురుచూపులు ఫలించాయి. కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కీలక నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం రూ.11500 కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కబురుతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల కష్టాలకు శుభం కార్డు పడినట్లే. అసలే 4 నెలలుగా జీతాలు లేవట. అంతేకాదు పింఛన్స్ కూడ అందడం లేదట కార్మికులకు.
Also Read: Train Tickets: తక్కువ ధరకు రైల్వే టికెట్లు కావాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!
ఇదే విషయాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో వివరించగా, పీఎం మోడీ వరాల జల్లు కురిపించారు. ఈ స్టీల్ ప్లాంట్ కు 7.5 మిలియన్ టన్నుల సామర్థ్యముంది. దీనినే నమ్ముకొని ఎందరో కార్మికులు జీవన మనుగడ సాగిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ప్లాంట్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఓ వైపు అభద్రతా భావంతో కార్మికులు ముందుకు సాగుతున్నా, కేంద్రం అందించే సాయం కోసం ఎదురుచూపుల్లో ఉన్నారు. చిట్టచివరకు కేంద్రం ఏకంగా రూ. 11500 కోట్ల రూపాయలు అందించేందుకు ముందుకు రాగా, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కూటమి నేతలు కూడ కేంద్రానికి స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నారు. పీఎం మోడీ పర్యటనతోనే రాష్ట్రంపై కేంద్రానికి సానుకూలత వాతావరణం ఏర్పడిందని వైజాగ్ వాసులు తెలుపుతున్నారు.