CM Revanth Reddy: కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ చేసిందని.. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ మేరకు రాష్ట్రంలో కులగణన చేశామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొదటి విడత సర్వేలో కోటి 12లక్షల 15వేల 134 కుటుంబాలు కులగణన సర్వేలో పాల్గొనగా.. రెండో విడతలో 21,715 కుటుంబాలు వివరాలు అందించాయని సీఎం పేర్కొన్నారు.
‘మొత్తంగా 3 కోట్ల 55 లక్షల 50వేల 759 మంది సర్వేలో వివరాలను అందించారు. మేం చేసిన లెక్క నూటికి నూరు శాతం కరెక్ట్. మేం సభలో పెట్టింది తీర్మానం కాదు.. బిల్లు. బీసీల రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపిన అన్ని పార్టీలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. బీసీల కోసం జెండాలు, అజెండాలు పక్కన ఏకాభిప్రాయంతో ఉన్నాం. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. చట్టబద్దత కోసం సభలో బిల్లులను ప్రవేశ పెట్టాం. వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయడమే మా విధానం. అన్ని పార్టీలను కలుపుకుని పోతాం. 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతాం. రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘కేసీఆర్ సహా అన్ని పార్టీల నాయకులు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. అందరి అభిప్రాయం ఒకటే అయినప్పుడు ఇది ఎందుకు సాధ్యం కాదు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించుకునేలా ప్రయత్నం చేద్దాం. ఈ బాధ్యత అన్ని పార్టీలపై ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మేం బాధ్యతలు చేపట్టగానే బీసీ కులగణన ప్రక్రియను మొదలు పెట్టాం. కులసర్వేలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తెలంగాణ సమాజం బలహీన వర్గాలకు రిజర్వేషన్ల విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారని సందేశం ఈ సభ ద్వారా పంపించాలనుకున్నాం’ అని సీఎం చెప్పుకొచ్చారు.
‘బీసీ రిజర్వేషన్లు 37 శాతానికి పెంచాలని గత ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదన పంపించింది. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచేందుకు గత ప్రభుత్వం గవర్నర్ కు పంపిన ప్రతిపాదనను ఉపసంహరించుకుని కొత్త ప్రతిపాదన పంపిస్తున్నాం. ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డే గా సభ ద్వారా తీర్మానం చేశాం. అందరినీ సంప్రదించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఈ బిల్లును తీసుకొచ్చాం. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా. బీసీ రిజర్వేషన్ల సాధనకు నేను నాయకత్వం వహిస్తా. అఖిలపక్ష నాయకులు అందరం కలిసికట్టుగా వెళ్లి ప్రధానిని కలుద్దాం. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుందాం’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
‘ఇందుకోసం ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇప్పించే బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ సభాపక్ష నాయకుడిని కోరుతున్నా. రాహుల్ గాంధీని కూడా కలిసి పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుదాం. రాహుల్ గాంధీని సమయం తీసుకోవాల్సిందిగా మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి బాధ్యత అప్పగిస్తున్నా. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా. కులసర్వేలో పొందుపరిచిన బీసీల లెక్క వందశాతం సరైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదు. కామారెడ్డి ప్రకటనకు మేం కట్టుబడి ఉన్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ALSO READ: TTD: తిరుమల వెళ్లే తెలంగాణ భక్తులకు TTD అదిరిపోయే న్యూస్.. ఇకనుంచి ఈజీగా..?