CM Revanth Reddy : కోట్ల మందికి గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవిశ్రాంతంగా పని చేస్తు్న్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరు కలిసికట్టుగా మన హైదరాబాద్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతీ హైదరాబాదీ భాగస్వామిగా మారాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి.. భాగ్యనగర అభివృద్ధికి సంబంధించిన మంచి విషయాల్ని ప్రపంచానికి తెలుపుదామని అన్నారు. ఈ సందర్భంగా.. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన కొన్ని విషయాల్ని ట్విట్టర్ లో సీఎం పంచుకున్నారు.
దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ నివేదికలో వెల్లడించింది. పరిపాలనా సౌలభ్యం, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, స్థిరాస్తి, ఇన్ ఫ్రాస్టక్చర్ వంటి అనేక అంశాలు ఇందుకు దోహదం చేశాయని ఈ నివేదికలో వెల్లడించారు.
ఇందులో.. ఏటికేడు భాగ్యనగరంలో సంపన్నుల జనాభా పెరుగుతోందని, ఈ పరిణామము ఇక్కడి పరిస్థితులకు అద్దం పడుతోందని వెల్లడించింది. తెలంగాణా రాష్ట్రానికి గుండె వంటి హైదరాబాద్ అభివృద్ధికి.. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న రేవంత్ సర్కార్ పనితీరుకు ఈ నివేదిక ఉదాహరణగా నిలుస్తోంది. అందుకే.. రేవంత్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇలాంటి మంచి విషయాల్ని అందరికీ చేరవేయాని సూచించారు.
ఇటీవల అక్రమార్కులపై ప్రభుత్వం అనుసరించిన కొన్ని విధానాలను అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్న విపక్షాలు హైదరాబాద్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. వాటిలో.. రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిందని, కొత్త ప్రాజెక్టులు రావడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారందరి ఆరోపణల్ని ఈ నివేదికలోని అంశాలు తప్పుపడుతున్నాయి.
ఇతర నగరాలతో పోల్చితే.. ఇక్కడి ప్రభుత్వ విధానాలు రియాల్టర్లకు అనుకూలంగా ఉండడం, సరికొత్త ఐటీ పాలసీలను అమలుపరుస్తుండడంతో నూతన కంపెనీల రాక పెరిగింది. దాంతో పాటే.. మరో ఓఆర్‌ఆర్ కు ప్రణాళికు రూపొందించడం, మూడో దశలో నగరంలోని మరిన్ని ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరణ చేస్తామని ప్రకటించడం మరింత ఆశల్ని పెంచింది. ముంబై, ఢిల్లీతో పోలిస్తే నగరంలో ఇళ్ల ధరలు తక్కువగా ఉండడమూ.. హైదరాబాద్ కు కలిసొస్తున్నాయి.
Also Read : ఏఆర్ రెహమాన్ చెప్తే అలా చేస్తావా.. రామ్ చరణ్ పై ఫ్యాన్స్ ఆగ్రహం.. ఉపాసన మద్ధతు
గతంలో కోటీశ్వర్లు మాత్రమే విశాలమైన, ఖరీదైన ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు.. కానీ ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఎగువ మధ్య తరగతి ప్రజలు కూడా లగ్జరీ నివాస గృహాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తు్న్నారు. దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్, కోకాపేట్, నియోపోలిస్, రాయదుర్గం, బాచుపల్లి ప్రాంతాల్లో నిర్మిస్తున్న లగ్జరీ విల్లాలు, ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ డిమాండ్‌తో శివారు ప్రాంతాల్లోని భూముల ధరలు అనుకోని స్థాయిలో పెరిగాయి. దీంతో నగరంలో నివాస గృహాల ధరలు 11 శాతం పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. హైదరాబాద్ తర్వాత బెంగళూరు, ముంబై ప్రాంతాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ తెలిపింది.