CM Revanth Reddy: భారత వాయు సేన (IAF) ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సోమవారం దిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ మంత్రితో రేవంత్ భేటి అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ భూసేకరణ, యూటిలిటీస్ బదలాయింపు తదితర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించతలపెట్టిన టెర్మినల్ బిల్డింగ్, కార్గో, ఎంఆర్‌వో (MRO), హ్యాంగర్ (Hangar) సదుపాయాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని రాజ్ నాథ్ ను రేవంత్ కోరారు. ఇందుకు సహకరించాలని భేటిలో విజ్ఞప్తి చేశారు. ఇటీవల మధ్య ఆసియాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎయిర్‌లైన్స్ సంస్థలు.. తమ హ్యాంగర్స్‌ను ఏర్పాటు చేసుకోవడానికి సరైన ప్రదేశాలను అన్వేషిస్తున్నాయని గుర్తుచేశారు. కాబట్టి హ్యాంగర్ ఏర్పాటుకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అత్యంత అనుకూలమైనదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
కీలక ప్రాజెక్టు కోసం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీప ప్రదేశాన్ని డీఆర్డీఓ ఎంపిక చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా రాజ్ నాథ్ వద్ద సీఎం రేవంత్ ప్రస్తావించారు. ఆ ప్రాజెక్ట్‌ను త్వరగా మంజూరు చేయాలని, వేగంగా పట్టాలెక్కించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. కాగా, ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రప్రభుత్వం తరపున విజ్ఞాపన పత్రాలను రక్షణశాఖ కార్యాలయానికి వారు అందజేశారు.
Also Read: ఫోన్‌లో ‘True 5G’ సిగ్నల్ ఉన్నా.. ఇంటర్నెట్ రావడం లేదా? అసలు కారణాలు ఇవే!
తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించి సీఎం రేవంత్.. ఇవాళ, రేపు దిల్లీలో పర్యటించనున్నారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, యాసంగిలో సేకరించిన ధాన్యం కొనుగోళ్ల కోటా పెంపు, రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరా తదితర అంశాలపై సంబంధిత శాఖల కేంద్ర మంత్రులతో రేవంత్ భేటి కానున్నారు. కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్లు ఇప్పించడంతో పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మెట్రో ఫేజ్ – 2 విస్తరణపై చర్చించేందుకు రైల్వే మంత్రితో అపాయింట్ మెంట్ ఇప్పించాలని శనివారం రోజున రేవంత్ బహిరంగ లేఖను సైతం కిషన్ రెడ్డికి రాశారు.
Also Read: సీలింగ్ vs పెడెస్టల్ ఫ్యాన్.. కూలింగ్ ‘కింగ్’ ఎవరు? అసలు నిజం ఇదీ!