Ceiling Fan vs Pedestal Fan: సీలింగ్ ఫ్యాన్, స్టాండ్ లేదా పెడెస్టల్ ఫ్యాన్.. ఈ రెండింటిలో ఏది రూమ్‌ను బాగా చల్లబరుస్తుంది? ఏది కొంటే బెస్ట్? అనే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతుంటాయి. అయితే ఈ రెండింటి పనితీరు, గాలిని అందించే విధానంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి దేని ప్రత్యేకత ఏంటీ? రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ముందుగా గుర్తొచ్చే సాధనం ఫ్యాన్. అయితే మార్కెట్లో రకరకాల ఫ్యాన్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువ మంది సీలింగ్ ఫ్యాన్ లేదా పెడెస్టల్ (స్టాండ్) ఫ్యాన్‌లను ఎంచుకుంటారు. కానీ గదిని చల్లబరచడంలో ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.
సీలింగ్ ఫ్యాన్ గది పైకప్పుకు అమర్చబడి ఉంటుంది కాబట్టి కింది పైపునకు ఎంతో తెలిగ్గా గాలిని ప్రసారం చేస్తుంది. దీనివల్ల గదిలోని మూలమూలకూ గాలి సమానంగా విస్తరిస్తుంది. ఒకే చోట ఎక్కువ మంది కూర్చున్నప్పుడు అందరికీ గాలి తగలాలంటే సీలింగ్ ఫ్యాన్ బెస్ట్ ఆప్షన్.
మరోవైపు పెడెస్టల్ ఫ్యాన్ ఒకే దిశలో గాలిని విసురుతుంది. ఇది గాలిని ఒకే చోట కేంద్రీకరించి శరీరంపైకి నేరుగా పంపుతుంది. దీనివల్ల చాలా వేగంగా అప్పటికప్పుడు చల్లదనం లభిస్తుంది. ఒకరు లేదా ఇద్దరు ఉన్నప్పుడు వేగంగా గాలి కావాలనుకుంటే స్ట్రాంగ్ గాలి పెడెస్టల్ ఫ్యాన్ బాగా ఉపయోగపడుతుంది.
నిజానికి ఫ్యాన్లు గది ఉష్ణోగ్రతను ఏమాత్రం ప్రభావితం చేయవని నిపుణులు అంటున్నారు. అవి కేవలం చర్మంపై ఉండే చెమటను త్వరగా ఆవిరయ్యేలా చేసి, మనకు చల్లని అనుభూతిని ఇస్తాయని పేర్కొంటున్నారు. పెడెస్టల్ ఫ్యాన్ వేగంగా గాలిని విసురుతుంది కాబట్టి సీలింగ్ ఫ్యాన్‌తో పోలిస్తే ఇది ఎక్కువ చల్లదనపు అనుభూతిని ఇస్తుందని తెలియజేస్తున్నారు. మరోవైపు సీలింగ్ ఫ్యాన్.. గదిలోని వేడి గాలిని పైకి లాగి.. గది అంతటా చల్లగాలి విస్తరించేలా చేస్తుంది.
Also Read: రిమోట్ అక్కర్లేదు.. మీ మాటే శాసనం.. పెంపుడు కుక్కలాంటి స్మార్ట్ ఏసీలు!
గది పెద్దదై ఉండి ఎక్కువ మందికి గాలి అందాలి అనుకుంటే సీలింగ్ ఫ్యాన్ బెస్ట్. అలా కాకుండా అద్దె ఇంట్లో ఉంటున్నా, ఫ్యాన్‌ను హాల్ నుంచి బెడ్‌రూమ్‌కు మార్చుకోవాలన్నా, స్టడీ టేబుల్, బెడ్ దగ్గర వేగవంతమైన గాలి కోరుకుంటే పెడెస్టల్ ఫ్యాన్ బెస్ట్ అని నిపుణులు వివరిస్తున్నారు. మెుత్తంగా మీ అవసరానికి తగ్గట్లు ఉన్న ఫ్యాన్ ను మీరే ఎంచుకోండి.
Also Read: అరాచకం సామీ.. థర్మాకోల్ గోడలతో ఇల్లు.. ఇక లైఫ్ లాంగ్ కూలింగ్ ఫ్రీ!