Paperless Bills: స్వేచ్ఛ బ్యూరోొ: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల నిర్వహణలో పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో ‘కాగితాల రహిత’ (పేపర్‌లెస్) బిల్లుల విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ఇకపై ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో భౌతిక (ఫిజికల్) బిల్లుల స్వీకరణను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఖజానా-లేఖల శాఖ (ట్రెజరీస్ అండ్ అకౌంట్స్) సంచాలకురాలు కే.పార్వతి దేవి వేర్వేరుగా మార్గదర్శకాలు జారీ చేశారు.
గతంలో సచివాలయ శాఖలతో పాటు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన ఈ విధానాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకూ విస్తరింపజేశారు. దీని ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని శాఖల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (డీడీఓలు) తమ బిల్లులను సమగ్ర ఆర్థిక నిర్వహణ, సమాచార వ్యవస్థ (ఐఎఫ్ఎంఐఎస్) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
Also Read: దమ్ముంటే ఆడియోలు బయట పెట్టండి.. హరీష్ రావుపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!
సమాచార సాంకేతిక (ఐటీ) చట్టం-2000 నిబంధనలకు అనుగుణంగా చెల్లుబాటు అయ్యే డిజిటల్ సంతకం ద్వారా ధ్రువీకరించిన బిల్లులను మాత్రమే ఆమోదిస్తారు. బిల్లులకు సంబంధించిన ఆధారిత పత్రాలను స్కాన్ చేసి, డిజిటల్ సంతకంతో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 15 నుంచి కాగితాల రూపంలో తీసుకొచ్చే భౌతిక బిల్లులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించవద్దని జిల్లా ట్రెజరీ అధికారులకు (డీటీఓ) ఖజానా శాఖ బుధవారంస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Also Read: రప్పా రప్పా నాటకాలకు చెక్ పెడతాం.. వైఎస్ జగన్‌పై హోం మంత్రి అనిత ఫైర్!