– ఖమ్మం జిల్లాలో సైంటిస్ట్ అశ్విని కుటుంబానికి పరామర్శ
– ఆమె సోదరుడికి ఇల్లు, ఉద్యోగమిస్తామని హామీ
– అనంతరం మహబూబాబాద్ జిల్లాలో బాధితులకు ఓదార్పు
– మరిపెడ మండలం సీతారాం తండా బాధితుల పరామర్శ
– మునిగిన మూడు తండాలూ కలిపి ఒకే గ్రామంగా ఏర్పాటు
– అందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని ఆదేశాలు
– తడిచిన సర్టిఫికెట్లు, పత్రాలు ఉచితంగా అందించే ఏర్పాట్లు
– పంటసాయంతో బాటు పశునష్టానికీ పరిహారం
– మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సమగ్ర సమీక్ష
– రోడ్ల మరమ్మతు, విద్యుత్ పునరుద్ధరణపై ఆరా
– విషజ్వరాల నివారణకు ఆరోగ్య శిబిరాల ఏర్పాటు
– పోలీసు, రెవెన్యూ సిబ్బంది పనితీరుకు ప్రశంసలు
– ముంపు బాధితులకు 10 రోజుల పాటు నిత్యావసరాలు
Telangana Floods: ఊహించని వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సాగుతోంది. సోమవారం ఖమ్మంలో పర్యటించి, బాధితులను ఓదార్చిన ముఖ్యమంత్రి మంగళవారం (ఈ రోజు) ఖమ్మంలోని గంగారం తండా, మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఉదయం 10 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరి, జిల్లాలోని కారేపల్లి మండలంలోని గంగారం తండాలో వరద ప్రమాదంలో మృతి చెందిన వ్యవసాయ సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మహబూబాబాద్ జిల్లాలోని పలు తండాలతో సీఎం వరద పరిస్థితిని పరిశీలించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రకృతి ప్రకోపం చూపించిందని, ఈ విపత్తులో నష్టపోయిన చివరి వ్యక్తినీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. సిఎం వెంట మంత్రులు సీతక్క, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అశ్విని కుటుంబానికి పరామర్శ..
మంగళవారం ఉదయం ఖమ్మం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి నేరుగా జిల్లాలోని కారేపల్లి మండలంలోని గంగారం తండా చేరుకుని వరద ప్రమాదంలో మృతి చెందిన ఈ తండా నివాసి సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు. ముందుగా అశ్విని తల్లి, సోదరుడితో మాట్లాడి వారిని ఓదార్చారు. అనంతరం అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ ఫోటోలకు పుష్పాంజలి ఘటించి, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భారీ వర్షాలతో ఆకేరు వాగు పొంగి ఎంతో భవిష్యత్ ఉన్న శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ మరణించటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అశ్విని కుటుంబానికి ఇల్లు లేనందున, ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో బాటు ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఛత్తీస్‌ఘర్‌లోని రాయపూర్‌లో వ్యవసాయ సైంటిస్టుగా పనిచేస్తోన్న అశ్విని, సోదరుడి వివాహ నిశ్చితార్థానికి సెలవుపై వచ్చి తిరిగి తండ్రితో కలిసి కారులో వెళుతుండగా, మహబూబాద్ దాటిన తర్వాత పురుషోత్తయ్య గూడెం వద్ద వరద నీటిలో వారు కారు గల్లంతై తండ్రీ కూతుళ్లు మరణించిన సంగతి తెలిసిందే.
అందరికీ ఇందిరమ్మ ఇళ్లు
అనంతరం అక్కడి నుంచి ముఖ్యమంత్రి మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం సీతారాం తండా వద్ద వరద ధాటికి కొట్టుకుపోయిన రహదారిని పరిశీలించారు. అనంతరం సీతారాం తండాలో వరద బాధితులతో మాట్లాడారు. ఆకేరు వాగు పొంగటంతో ధర్మారం, పురుషోత్తమాయ గూడెం, సీతారాంతండాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఈ మూడు తండాలు కలిపి ఒకే గ్రామ పంచాయితీగా మార్చి, అందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంటనే బాధితుల వివరాలు సేకరించి ఇండ్ల పనులు ఆరంభించాలని స్పష్టం చేశారు. పంటనష్టం పూర్తిగా అంచనావేసి బాధితులకు ఆర్థికసాయం అందిస్తామన్నారు. ఆకేరు వాగు పొంగిన ప్రతిసారీ..ఇక్కడి జనం ఇబ్బంది పడుతున్నందున వాగు ప్రవాహాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి కొత్త వంతెన కట్టాలని అధికారులను ఆదేశించారు. ఆకేరు ధాటికి దెబ్బతిన్న ఇళ్లలో దెబ్బతిన్న పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్స్ మీద పోలీసు శాఖ ఒకే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అందరికీ ఉచితంగా తిరిగి నూతన కార్డులు, సర్టిఫికెట్స్ ఇవ్వాలని కలెక్టరుకు సూచించారు.
Also Read: Khammam: బీఆర్ఎస్ నేతల ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత.. వాహనాలపై రాళ్లదాడి
కలెక్టరేట్‌లో సమీక్ష
సీతారాం తండా నుంచి ముఖ్యమంత్రి నేరుగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని వరద విధ్యంసంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం వీక్షించారు. అనంతరం మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్ , ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి వరదపై సమీక్ష నిర్వహించారు. వాస్తవానికి మహబూబాబాద్ జిల్లాకు రెడ్ అలెర్ట్ లేదని, కానీ, అకస్మాత్తుగా భారీ వర్షం, వరద రావటంతో వందేళ్లలో ఎన్నడూ కురవనంత వాన కురిసి, ఆకేరు పొంగి.. జిల్లా పరిధిలో నలుగురు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సచివాలయం నుండి కమాండ్ కంట్రోల్ నుండి అధికారులు, తాను అనుక్షణం పరిస్థితిని అంచనా వేస్తూ, అప్రమత్తంగా వ్వవహరించటంతో భారీ ప్రాణనష్టం వాటిల్లకుండా ఆపగలిగామన్నారు. జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందని, 96 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని, 215 పశువులు చనిపోయాయని, 45 చెరువులు తెగిపోయాయని అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం 106 గ్రామాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని తెలిపారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికి పదివేల చొప్పున నష్టపరిహారం అందిస్తామని, ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారికి తక్షణ సాయంగా రూ. 10 వేలు అందించాలని, చనిపోయిన జీవాలకు నష్టపరిహారం అందించాలని, వెంటనే గ్రామాలకు కరెంటు సరఫరాను పునరుద్ధరించాలని సీఎం కలెక్టర్‌ను ఆదేశించారు. తక్షణ సాయం కింద జిల్లాకు 5 కోట్లు ప్రకటించారు.
మోదీజీ.. ఆదుకోండి
వాతావరణ శాఖ ఊహించని రీతిలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న తెలంగాణ ప్రాంతవాసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. దీనిని జాతీయ విపత్తు గా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశామని, వీలున్నంత త్వరగా జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి తెలంగాణకు రావాలని ప్రధాని మోదీని కోరినట్లు సీఎం తెలిపారు.
శభాష్.. నగేష్
వరద సమయంలో పోలీసు శాఖ వెంటనే రంగంలోకి దిగి, అనేకమందిని ముందుగానే హెచ్చరించటంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని సీఎం అన్నారు. ముఖ్యంగా సీతారాం తండాలో తెల్లవారుజామున ఊహించని రీతిలో వచ్చిన వరద కారణంగా తండా అంతా జలదిగ్బంధంలో చిక్కుకోగా, ఆ సంగతి తెలుసుకుని సిబ్బందితో రంగంలోకి దిగి సహాయచర్యలు అందించి, భారీ నష్టం జరగకుండా చూసిన ఎస్సై నగేష్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
Also Read: Roja Comments: విహార యాత్రల కోసం సీఎం, మంత్రులు ప్లాన్ చేసుకుంటూ.. వరద బాధితులను పట్టించుకోవట్లేదు:
కీలక సూచనలు..
వరద తీసిన తర్వాత ఆ ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని, కనుక వెంటనే మెడికల్, హెల్త్ డిపార్ట్‌మెంట్లు రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే వేరే జిల్లాల నుంచి సిబ్బందిని తాత్కాలికంగా నియమించాలని, వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులకు 10 రోజుల పాటు ఆహారం, మంచి నీరుతో బాటు నిత్యావసరాలు అందించాలన్నారు. ఈ విపత్తు వివరాలను బ్లూ బుక్‌లో ఎంట్రీ చేయాలని, ఇది భవిష్యత్ రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుందని సూచించారు. మహబూబాబాద్ పట్టణంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు సీఎం ఆదేశించారు. ముంపు బాధితులకోసం 7 రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసి, 700 మందికి పునరావాసం కల్పించామని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. మహబూబాబాద్‌లో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, నాలాల లెక్క తీయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వర్షం తగ్గినందున తక్షణమే బురద తొలగించే చర్యలు అధికారులు చేపట్టాలని, ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తే ఇళ్లలోని బురద తొలగించుకోవచ్చని సలహా ఇచ్చారు.
కిడ్డీబ్యాంక్ ఇచ్చిన చిన్నారి..
వరద బాధితులను పరామర్శించేందుకు మహబూబాబాద్ వచ్చిన సీఎంను పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు కలిసింది. తన కిడ్డీ బ్యాంక్‌లోని రూ.3 వేల రూపాయలను ముఖ్యమంత్రికి అందించి తన పెద్దమనసు చాటుకుంది. చిన్నవయసులోనే ఎంతో ఉదారతను చూపిన సింధును ముఖ్యమంత్రి అభినందించారు. ఈ మొత్తాన్ని వరద బాధితుల సంక్షేమం కోసం వాడతామని హామీ ఇచ్చారు.