CM Revanth Reddy: తెలంగాణ స్వేచ్ఛ, బ్యూరో: అభివృద్ధి పనుల కోసం తల తాకట్టు పెట్టైనా నిధులు తెస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన కూకట్ పల్లి నల్ల చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కూకట్ పల్లికి రావడం సంతోషంగా ఉన్నదన్నారు. కష్టకాలంలో మల్కాజ్ గిరి ప్రజలు తనను ఆదుకున్నారన్నారు. వారి కోసం ఏం చేసినా తక్కువేనంటూ సీఎం వివరించారు. రాజకీయాలకు అతీతంగా మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తా నని హామీ ఇచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి, సంక్షేమం ముందుకు తీసుకెళ్లడమే తమ విధానం అన్నారు.
చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నప్పుడు ఎంతమంది ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా మౌనంగా భరించా నని, నల్ల చెరువు అభివృద్ధిని చూసాక ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూస్తే తనకు ఆ విమర్శలు ఆశీర్వాదంగా మారినట్లు కనిపిస్తోందన్నారు. పేదవాడిని ఇబ్బంది పెట్టడం, ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, వరదలు వచ్చినపుడు ముంపు బాధితులుగా మిగలకూడదు అనేది తమ తపన అన్నారు. చెరువులు, నాలాలను ఆక్రమించుకున్న వారికి తప్పకుండా న్యాయం చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉన్నదన్నారు. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. చిన్నారుల కోసం చెరువుల ఒడ్డున ఆటస్థలాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.
నగరంలోని చెరువులన్నింటినీ పునరుద్దరించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. దేశంలో మహానగరాలు సమస్యలతో సతమతమవుతున్నాయని, అందుకే మన నగరంలో ప్రకృతిని కాపాడుకుని చెరువులను పునరుద్ధరించుకుందామన్నారు. మూసీ నది ప్రక్షాళన చేసుకుందామన్నారు. కోర్ అర్బన్ రీజియన్ లో ఉన్న చెరువులన్నీ పునరుద్ధరించుకుందామని, నాలాల ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇక రోడ్ల విస్తరణ చేపడుదామన్నారు. ఒక మంచి నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చి దిద్దుకుందామన్నారు. అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని, ఇప్పుడు కాకపోతే అభివృద్ధి చేసే అవకాశం రాదన్నారు. మల్కాజ్ గిరి ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా…తన దృష్టికి తీసుకురావాలని సీఎం చెప్పారు. మల్కాజ్ గిరి ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసే అవకాశాన్ని పొందినట్లు సీఎం గుర్తు చేసుకున్నారు.