CM Revanth Reddy: తెలంగాణ శాసనసభ వేదిక మరోసారి వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చ సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు సభలో హడావుడి సృష్టించాయి. హరీష్ రావు అసంపూర్ణ సమాచారం ఆధారంగా మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు చెబితే వీళ్ల అబద్ధాలు బయటపడతాయని భయపడుతున్నారు అంటూ రేవంత్ విమర్శలు గుప్పించారు.
సీఎం రేవంత్ ప్రసంగం ఇలా..
ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టులో నీటి లభ్యతపై ఎలాంటి అనుమానాలూ లేవు. 2014 అక్టోబర్ 24న అప్పటి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి స్పష్టంగా లేఖ రాశారు. 205 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ, హరీష్ రావు మళ్లీ పునర్విచారణ కోరుతూ మరోసారి లేఖ రాశారు. ఇది ప్రజలను గందరగోళానికి గురిచేయడమే అని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి, హరీష్ చర్యలను ఎద్దేవా చేస్తూ, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి సర్టిఫికెట్ తీసుకున్నాక, మళ్లీ రీకౌంటింగ్ చేయాలా అని అడిగేంత అర్ధరహితమైన చర్య ఇది. 2009లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీరు అందుబాటులో ఉందని అనుమతి ఇచ్చింది. ఆ రికార్డులు స్పష్టంగా ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే ఆ రికార్డులను దాచిపెట్టిందని మండిపడ్డారు.
అంతేకాకుండా, పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో బయటపెట్టిన వాస్తవాలను కూడా రేవంత్ ప్రస్తావించారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో, హరీష్ రావు చేసిన తప్పులు స్పష్టంగా రికార్డయ్యాయి. నివేదికలోని 98వ పేజీ చదివితేనే నిజాలు అర్థమవుతాయి. అయినా కూడా, ఆ వాస్తవాలను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
Also Read: India Post: బిగ్ షాకిచ్చిన పోస్టల్.. అక్కడికి అన్నీ బంద్.. వాట్ నెక్స్ట్!
సీబీఐ కావాలా, సీబీసీఐడీ కావాలా.. ఎలాంటి విచారణ కావాలో స్పష్టంగా చెప్పకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించడం హరీష్ గారి అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు మేము అన్ని రికార్డులను వెలుగులోకి తీసుకొస్తున్నామని రేవంత్ ధ్వజమెత్తారు.
ప్రాజెక్టు రీడిజైన్ వల్ల జరిగిన అవినీతి మరియు నష్టాలను కూడా రేవంత్ సభ ముందుకు తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మార్చడం, ఊరు మార్చడం, ఎత్తు తగ్గించడం అన్నీ ఒక పెద్ద దోపిడీకి బాటలు వేసాయి. కేసీఆర్, హరీష్ ఇద్దరూ కలిసి ప్రాజెక్టు దిశను మార్చారు. ప్రజల సొమ్ముతో ఆడుకున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసంపూర్ణ సమాచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేయడం ఇక ఆగాలి. నిజం చెప్పే ధైర్యం లేకపోతే, రికార్డుల్లోని అబద్ధాలను తొలగించాలి. హరీష్ రావు గారు చేసిన తప్పులను చరిత్ర మరిచిపోదని అన్నారు.
సభలో ఈ వ్యాఖ్యలతో ఒక దశలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయగా, సీఎం రేవంత్ తన మాటలపై నిలబడి, అన్ని ఆధారాలు రికార్డులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఆదివారం అసెంబ్లీలో జరిగిన ఈ చర్చ కాళేశ్వరం వివాదానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరిన్ని రహస్యాలు బహిర్గతం అయ్యే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. రేవంత్ ఈ ధాటివైన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన రేపగా, కాంగ్రెస్ వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని విశ్లేషకులు అంటున్నారు.